ఆదిలాబాద్,జనవరి16: వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన విశ్వవిద్యాలయం జిల్లా కేంద్రంలోనే ఏర్పాటయ్యేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఆదిలాబాద్ పట్టణంలో వసతులు ఉండడంతో పాటు ఇక్కడయితేనే విద్యాపరంగా అభివృద్దికి ఆస్కారం ఉంటుందని ఆ పార్టీ నేతలు అన్నారు. కొందరు కుట్రపూరితంగా దీనిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రూ.55 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా కేంద్రంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారని చెప్పారు. కానీ కొందరు కుట్రపూరితంగా దీన్ని నిర్మల్‌కు తరలించడానికి యత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణానికి కేవలం నిజామాబాద్ విశ్వవిద్యాలయం అందుబాటులో ఉందన్నారు. జిల్లాలోని మిగతా వారికి విశ్వవిద్యాలయం ఉండాలంటే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రూ.1,200 కోట్లు మంజూరైనట్లు సిపిఐ జిల్లా నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఖమ్మం, ఆదిలాబాద్, శ్రీకాకుళం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక నాయకులు విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆదిలాబాద్‌లో ఏర్పాటు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. రాజకీయ లబ్ది కోసం దీన్ని విస్మరిస్తే వారి చేతకానితనం అవుతుందన్నారు. ఒక వేళ వారు ఈ విషయంలో కల్పించుకోవడానికి ఆసక్తి లేకపోతే బహిరంగంగా ప్రకటిస్తే తాము ఉద్యమాలు చేసైనా విశ్వవిద్యాలయం ఆదిలాబాద్‌లో ఏర్పాటయ్యేలా చూసుకుంటామన్నారు. ఈ విషయంలో తమ పార్టీ నాయకత్వానికి వివరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు.




