Tuesday, 3 November 2026

తెలంగాణ న్యాయమైంది

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు కట్టుబడి ఉన్నాం
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్‌ భూషణ్‌
హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ న్యాయమైందేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకుడు ప్రశాంత్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఆయన పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఏవీ కళాశాల మైదానంలో నిర్వహించిన పార్టీ వలంటీర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వెనుకబాటు తనం నుంచి బయటపడడానికి ఆ ప్రాంతం వారికి అధికారం కట్టబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. సుపరిపాల వల్ల సామాన్యుడికి ఉత్తమ సేవలు అందుబాటులోకి తేవచ్చని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కొందరు తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. ఇది తెలంగాణ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. పరిపాలనలో క్రమబద్ధ విధానం అమలు చేయాల్సి ఉందని తెలిపారు. అలా నడుచుకోని చోట ప్రజల తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నారని, స్వరాష్ట్రం, స్వపరిపాలన కోరుకుంటున్నారని చెప్పారు. కొద్ది మంది చేతిలో అధికారం బందీ కావడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యతిరేకమని తెలిపారు. గ్రామాలు, కాలనీల స్థాయికి అధికార ఫలాలు చేరాల్సిన అవసరం ఉందన్నారు. ఆప్‌ తెలంగాణకు మద్దతు పలకడంతో సభకు హాజరైన పలువురు ముస్లిం నేతలు ప్రశాంత్‌భూషణ్‌తో కరచాలనం చేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణకు ఆప్‌ అనుకూలమని ప్రకటించడంతో సభలో కొందరు సీమాంధ్రులు ఆందోళనకు దిగారు. అవినీతి, తదితర సమస్యలపై దృష్టి సారించాలే కాని అత్యంత సున్నితమైన తెలంగాణ అంశాన్ని స్పృశించవద్దంటూ ప్రశాంత్‌భూషన్‌ను హెచ్చరించే ప్రయత్నం చేశారు. వారిని తెలంగాణకు చెందిన నేతలు అడ్డుకున్నారు. పోలీసులు సీమాంధ్ర నేతలను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. రాష్ట్రంలో ఎనిమిది మందితో ఆప్‌ సమన్వయ కమిటీని ప్రశాంత్‌ భూషణ్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రొఫెసర్‌ రమేశ్‌రెడ్డి, సి. వినోద్‌కుమార్‌, స్నేహలత, అరుణ, విజయ్‌ ప్రశాక్‌, అర్షన్‌ హుస్సేన్‌, ఎంపీ థామస్‌ సభ్యులుగా ఉంటారు. పార్టీ జాతీయ స్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న రామకృష్ణరాజు రాష్ట్ర సమన్వయ కమిటీలోనూ కీలక పాత్ర పోషిస్తారని ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో పార్టీ సభ్యులు 30 వేల మంది ఉన్నారని తెలిపారు. దానిని రెండు లక్షలకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 300 నుంచి 400 స్థానాలకు పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. లోక్‌సత్తాను తమ పార్టీలో విలీనం చేస్తే సంతోషిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *