తెలంగాణ నెటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ప్రారంభం
సిటీబ్యూరో, జనవరి 18 (జనంసాక్షి) :
తెలంగాణ పునర్నిర్మాణం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగించిన పోరాటంపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు తెలంగాణ నెటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం బెంగళూర్‌లో ఆచార్య జయశంకర్ తెలంగాణ రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించారు. నగరంలోని మారథహళ్లిలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా శ్లోకా టెలికాం సీఈవో సుజై కారంపూడి మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో ఐటీ నిపుణుల బాధ్యత ఎంతగానో ఉందని తెలిపారు. జ్ఞాన విస్తరణ, కేరీర్ గైడెన్స్‌తో పాటు నిరుద్యోగులైన తెలంగాణ విద్యార్థులకు తోడ్పాటునందిస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు వల్ల ఫెడరల్ వ్యవస్థకి ఏమాత్రం విఘాతం కలగదని ఆయన స్పష్టం చేశారు. ఐక్య రాజ్య సమితిలో నిజాం నవాబు వేసిన కేసు పెండింగ్‌లో ఉన్నందువల్లే 1969లో ఇందిరాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వలేకపోయారని తెలిపారు. అంతేకాని ఆమె తెలంగాణకు, చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదన్నారు. ఇందిరా హయాంలోనే అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకే విభజన జరగాలని కోరుకోవడమే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రవి చైతన్య మాట్లాడుతూ, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా తెలంగాణలో విద్యావ్యవస్థను మెరుగు పరచడానికి కృషి చేయాలన్నారు. ప్రజల్లో రగిలిన చైతన్యాన్ని కాపాడుకుంటూనే పునర్నిర్మాణంలో భాగం కావాలని అప్పుడు మన రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి తెలంగాణ ముసాయిదాపై అభిప్రాయం చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించొద్దని కోరారు.




