సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్
నా శాఖ తెలంగాణోళ్లకు ఎందుకియ్యలేకపోయావ్
నీ మంత్రివర్గంలో నేను కొనసాగను : శ్రీధర్‌బాబు
వరంగల్, జనవరి 19 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి ఖేల్ ఖతమని మంత్రి పదవికి రాజీనామా చేసిన డి. శ్రీధర్‌బాబు అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన బ్రాహ్మణ ఐక్యతా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చివరి బంతికి ఏదో అద్భుతం సృష్టిస్తానని గొప్పలు చెప్తున్న ముఖ్యమంత్రి ఆట ఇప్పటికే ముగిసిందని ఇంకేమాడుతాడంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయమే ఫైనల్ అని, కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్న కిరణ్ తర్వాత ఎందుకు దిక్కరించాడని ప్రశ్నించారు. శాసనసభ వ్యవహారాల శాఖను తన నుంచి తప్పించిన కిరణ్ మరో తెలంగాణ మంత్రికి ఆ శాఖను ఎందుకు ఇయ్యలేకపోయారని నిలదీశారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శైలజానాథ్‌కు పక్షపాతంతో శాసనసభ వ్యవహారాల శాఖను కేటాయించడం ముఖ్యమంత్రి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం, ఆత్మగౌరవం కోసం నాలుగున్నర దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న విషయాన్ని మరిచి కుట్రలతో సమైక్యవాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ముఖ్యమంత్రి మంత్రివర్గంలో తానెప్పటికీ కొనసాగబోనని ఆయన తేల్చిచెప్పారు. సీమాంధ్రులు ఎన్ని కుట్రలు పన్నినా ఫిబ్రవరిలో పార్లమెంట్ తెలంగాణ బిల్లును ఆమోదిస్తుందని తెలిపారు. ముసాయిదా రాష్ట్రానికి వచ్చినప్పుడు చర్చకు మోకాలడ్డి ఇప్పుడు గడువు పెంచాలని కోరడం బిల్లు పార్లమెంట్ ముందుకు రాకుండా అడ్డుకునేందుకేనని ఆయన తెలిపారు. సీమాంధ్ర ముఖ్యమంత్రి నెల రోజుల గడువు కోరడం వెనుక అనేక కుట్రలున్నాయని, కానీ ఆ కుట్రలు అధిష్టానం ముందు నిలువబోవన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తదితరులు మాట్లాడారు.
ఖేల్ ఖతం ఇంకేమాడుతావు కిరణ్




