ఆదిలాబాద్,జనవరి20: వేదపాఠశాల స్థాపించి జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన అచ్చలాపూర్‌లోని శ్రీమహదేవ వేదపాఠశాలకు మహర్దశ పట్టనుంది. గరికపాటి మహదేవశాస్త్రి 1952లో ఆయన ఇక్కడ వేదపాఠశాలను స్థాపించారు. ఈనెల 26న వేదపాఠశాల ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు పాఠశాల ప్రధాన గురువు దుద్దిళ్ల మనోహర్‌శర్మ తెలిపారు. ఇందులో భాగంగా వేదపాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 25 వరకు శ్రీమద్భాగవత సప్తాహ పురాణ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 24, 25 తేదీల్లో రుద్రాభిషేక రుద్రయాగాలు, తర్వాత 26న ఉదయం శ్రీమహదేవ శాస్త్రి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తుని, శ్రీపీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీసచ్చిదానంద సరస్వతీ స్వామి కార్యక్రమానికి హాజరై విగ్రహావిష్కరణ చేస్తారని ఆయన తెలిపారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది వేదవిద్యలో రాణిస్తూ వివిధ ప్రాంతాల్లో మంచి గుర్తింపు పొందుతున్నారు. అప్పటి నుంచి ఇక్కడ వేదవిద్య నిరంతరం కొనసాగుతోంది. సనాతన ధర్మాన్ని కాపాడే క్రతువులో భాగంగా వందల మందికి ఇక్కడ వేదవిద్యను ఉచితంగా అందిస్తున్నారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులకు కారణమైన వేదవిద్యాప్రదాతకు వేదపాఠశాలలో అరుదైన స్థానాన్నిస్తూ ఆమహానుభావున్ని నిరంతరం గుర్తు చేసుకునే విధంగా విగ్రహ ప్రతిష్ఠాపనకు పూనుకున్నారు. మహదేవశాస్త్రి కుటుంబసభ్యుల సహకారంతో ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు.




