రాష్ట్రపతి, ప్రధాని భేటీలో ప్రస్తావన
అది నా చేతిలో లేదు
ముసాయిదా ఎలా పంపాలో తెలుసుకునేందుకే వచ్చా : మహంతి
న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) :
ఆంధప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చకు గడువు పొడిగింపు అంశంపై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఉభయసభల సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని రాష్ట్రపతిని కలిశారు. పార్లమెంట్ సమావేశాలపైన వీరు చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) పై రాష్ట్ర శాసనసభలో చర్చకు గడువు పెంపు అంశంపైన కూడా వారు చర్చించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడువు పొడిగిస్తారా అనే అంశంపై అందరూ దృష్టి సారించిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్లు ప్రతులను చించి తగులబెట్టిన వారే ఇప్పుడు చర్చకు గడువు పెంచాలని కోరడం, బిల్లు అసెంబ్లీకి వచ్చింది మొదలు చర్చకు ఉపక్రమించని వారు ఇప్పుడు చర్చ జరగాలని, సమగ్రంగా జరగాలని కోరుకోవడంపై తెలంగాణ ప్రతినిధులు మండిపడుతున్నారు. అందుకే గడవు పెంచాలని కోరుతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈలోగా బిల్లు ఇక్కడే ఆగిపోవాలన్నది సీమాంధ్ర నేతల కుట్ర. బిల్లు ఇక్కడే ఆగిపోతే,పార్లమెంట్ సమావేవాలు ముగిస్తే, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక విభజన ప్రక్రియ నిలిచిపోతుందన్న ఆశ. అందుకే చర్చ పేరుతో గడువు పెంచాలని కోరుతున్నారు. రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చర్చకు శాసనసభ సమావేశాల గడువు పొడగిస్తే విభజన పక్రియ ఆగిపోతుందని వివిధ పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నేతలమంతా వచ్చి కలిసేందుకు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వమని తెలంగాణ ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు. అందుకే అన్ని విషయాలు తెలిసిన ప్రణబ్ ముఖర్జీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై చర్చకు ఈ నెల 23తో ఇప్పటికే ఇచ్చిన ఆరువారాల గడువు ముగియనుంది. ఒక పక్క బిల్లుపై చర్చకు గడువు పొడగించవద్దంటూ తెలంగాణ మంత్రులు రాష్ట్రపతికి లేఖను ఫ్యాక్స్ చేశారు. ఇదిలా ఉండగా, విభజన ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పొడగించాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పి.కె.మహంతి రాసిన లేఖను కేంద్ర ¬ం శాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది. ¬ంశాఖ అధికారులతో చర్చించేందుకు సీఎస్ ఢిల్లీ చేరుకున్నారు. మరో పక్క ఇప్పటికే మరో నెల రోజులు గడువు పొడగించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు కోరారు. విభజనను అడ్డుకునేందుకే వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాపై చర్చకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు ఆయన 450 పేజీల ప్రసంగాన్ని రెడీ చేసుకున్నారని సమాచారం. తాను అన్ని విషయాలపై సమాధానం ఇస్తానని ఇప్పటికే సిఎం ప్రకటించారు. కిరణ్ ప్రసంగానికి ఎనిమిది గంటల నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణపై తాను సమగ్రంగా సమాధానం ఇస్తానని కూడా ప్రకటించారు. అసెంబ్లీ చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు మరో నెలరోజులు గడువు ఇవ్వాలని రాష్ట్రపతికి సీఎం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే నెల రోజుల గడువు ఇవ్వటం కష్టమేనని ¬ంశాఖ అంటోంది. తుది నిర్ణయం మాత్రం రాష్ట్రపతిదేనని ¬ంశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు గడువు పెంచవద్దంటూ తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ అంశంపై వారు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడా కోరారు. ఇప్పటికే ఎంపీ వివేక్ రాష్ట్రపతిని కలసి గడువు పెంచవద్దని కోరారు. ముసాయిదా బిల్లుపై శాసన సభలో చర్చించేందుకు 294 మంది శాసన సభ్యులకు అవకాశం ఇవ్వాలని, బిల్లులోని ప్రతీ క్లాజ్ పై సమగ్ర చర్చ జరపాలని సీమాంధ్ర నేతలు కోరుతున్నారు. అయితే ఢిల్లీకి వచ్చిన సీఎస్ ప్రసన్నకుమార్ మహంతి గడువు పెంపు తన చేతిలో లేదని చెప్పారు. ముసాయిదా ఎలా పంపాలో తెలుసుకునేందుకే ఢిల్లీకి వచ్చానని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో సీమాంధ్రులు గడువుపెంపుపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయనే ప్రచారమూ సాగుతోంది. మొత్తానికి బుధవారం సాయంత్రానికి కల్లా రాష్ట్రపతి భవన్ నుంచి గడువుపై సమాచారం వచ్చే అవకాశముంది.
గడువు పొడిగింపుపై తర్జన భర్జన




