ఎస్పీ చీఫ్ ములాయం సింగ్
వారణాసి, జనవరి 23 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చేతులు రక్తపు కంపు కొడుతున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ను గుజరాత్‌లా మార్చుతానంటున్న మోడీపై ములాయం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం వారణాసిలో నిర్వహించిన ‘దేశ్ బచావో..దేశ్ బనావో’ కార్యక్రమంలో ములాయం పాల్గొని మాట్లాడారు. మోడీ చేతులు అమాయక ప్రజల రక్తంతో తడిశాయని ఆయన ధ్వజమెత్తారు. గోద్రాలాంటి దారుణ ఘటనలు స్వతంత్ర భారత దేశంలో మరెక్కడా చోటు చేసుకోలేదని తెలిపారు. అలాంటి దారుణాలు కళ్లముందే కదలాడుతున్నా మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తోందని ఆ పార్టీపై మండిపడ్డారు. మోడీ పాలనలో గుజరాత్‌లో అనేక అరాచకాలు, ఊచకోతలు జరిగాయని యూపీలోనూ అలాంటి పరిస్థితులే సృష్టిస్తారా అంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం నిరుద్యోగులకు జీవనభృతి కల్పిస్తోందని, రైతులకు బ్యాంకు జారీ చేసిన రుణాలను రద్దు చేసిందని, మహిళల అభివృద్ధికి అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. ఈ పథకాల్లో ఏ ఒక్కటైనా గుజరాత్‌లో అమలు చేస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. గోరఖ్‌పూర్‌లో మోడీ బహిరంగ సభ జరుగుతుండగానే ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యూపీఏ ప్రభుత్వంలో అవినీతి, కుంభకోణాలు పెట్రేగిపోయాయని, ఆహార ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేనంతగా దెబ్బతీసిందని అన్నారు. ఏళ్లకేళ్లుగా అధికారంలో ఉన్నా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో యూపీఏ సర్కారు దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.
మోడీ చేతులు రక్తపు కంపు




