Tuesday, 3 November 2026

విడిపోతే మీరే నష్టపోతారు

కరెంటుండదు.. అన్నీ కష్టాలే : సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, జనవరి 23 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదాపై చర్చలో పాల్గొంటూ సీఎం కిరణ్‌ అసత్యాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. కొందరు సత్యదూరమైన అంశాలతో తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించారని, తాను విద్వేషాలు తొలగించే ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో చెప్పారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులు అన్యాయం చేశారన్న భావన కలిగించారని ఆయన అన్నారు. అందుకే తాను వివిధ రంగాల్లో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందీ వివరించదల్చుకున్నానని రెండోరోజు గురువారం సభలో చెప్పారు. అడుగుడుగనా టీఆర్‌ఎస్‌ సభ్యులు అడ్డంకులు కలిగిస్తున్నా వారిని వారిస్తూనే తన ప్రసంగం కొనసాగించారు. ఇరుప్రాంతాల ప్రజలు కలసి ఉండాల్సి ఉందని, కలసి సాగాల్సి ఉందని, కలసి బతకాల్సి ఉందని, వారి మనసుల్లో విభేదాలు సృష్టించవద్దనే తాను ఈ ప్రయత్నం చేస్తున్నానని పదేపదే చెప్పారు. రాష్ట్రక విభజన జరిగినా, జరగకపోయినా… ప్రజల మధ్య విద్వేషాలు ఉండకూడదని, అవాస్తవాలతో ప్రజల్లో అపోహలు పెంచుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల మధ్య ఉన్న విద్వేషాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో సాగునీటి రంగం బాగా అభివృద్ది చెందిందని అన్నారు. 1956తో పోలిస్తే తెలంగాణలో భారీగా ఆయకట్టు పెరిగిందని, నిధుల కేటాయింపులో తెలంగాణకు న్యాయం జరిగిందని, ఇరిగేషన్‌లో తెలంగాణకే భారీగా నిధుల కేటాయింపు కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా నది కింద 74 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, రాష్ట్రం కలిసి ఉంటేనే సాగునీటిని సద్వినియోగం చేసుకుంటామని సీఎం కిరణ్‌ అన్నారు. పులిచింతల, దుమ్ముగూడెం ఎత్తిపోతల ప్రాజెక్టులతో జూన్‌లోనే డెల్టాకు నీరు అందించవచ్చునని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం కూడా తెలంగాణకే న్యాయం చేసిందని అన్నారు. వేలకోట్లు తెలంగాణకే కేటాయించామన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ప్రాజెక్టుల కోసం వెచ్చించిన సొమ్ము అంతా వృథా అవుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. డెల్టా ఆధునీకరణ పేరుతో బీమాకు 20 టీఎంసీలు మళ్లించామని అన్నారు. కల్వకుర్తి, నెట్టంపాటు, బీమాకు సాగునీరు కష్టమవుతుందని సీఎం తెలిపారు. కిరణ్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావు నోరు, చేతులు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దీంతో సభలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. సభాపతి సభ్యులకు సర్దిచెప్పడంతో సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రం కలిసి ఉంటేనే ఇరు ప్రాంతాలకు విద్యుత్‌, సాగునీరు మళ్లించుకునే అవకాశం ఉంటుందని, విడిపోతే అంతర్గత సర్దుబాట్లు ఉండవని, విద్యుత్‌ పంపిణీ కూడా కష్టమవుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విడిపోతే ప్రధానంగా తెలంగాణలో విద్యుత్‌ సమస్యలు వస్తాయని అన్నారు మొన్నటి వేసవిలో కొంత విద్యుత్‌ కొరతతోనే అల్లాడామని, అలాంటిది ఇప్పుడు విద్యుత్‌ సమస్య తెలంగాణను వేధించగలదన్నారు. ఇవన్నీ తెలంగౄణ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఒక ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు మరో ప్రాంతం నుంచి నీటిని సర్దుబాటు చేస్తున్నామని ఆయన అన్నారు. సాగునీరు కేంద్రం పరిధిలోకి పోతే మన పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. సాగునీరు రాష్టాల్ర అంశాలకు సంబంధించినదని, కేంద్రం జోక్యం చేసుకోకూడదని చెబుతూ.. ఆ వివరాలు తరువాత మాట్లాడతానని కిరణ్‌ తెలిపారు. 2009లో భారీ వరదలు వచ్చాయని, శ్రీశైలం డ్యామే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని, ప్రాణాలకు తెగించి ఇరు ప్రాంతాల ఇంజనీర్లు డ్యాములను కాపాడారని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఒకే రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి అధికారులంతా ఒక్కటై ప్రమాదాన్ని నివారించగలిగారని, అదే గనక విడిపోతే సాధ్యమయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. బాక్రా డ్యామ్‌ ఛైర్మన్‌ను కాల్చి చంపారని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని హెచ్చరించారు. 250 కి.మీ. పొడవునా నదిని నీలువునా చీల్చే విభజన ఎక్కడా లేదని సీఎం కిరణ్‌ పేర్కొన్నారు. కరెంట్‌, నీరు పంపిణీ ఒకే రాష్ట్రంలో ఉంటేనే సక్రమంగా నిర్వహించగలమని ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి, సాగునీటిని సమన్వయం చేస్తేనే ఇరు ప్రాంతాలకు న్యాయం చేయగలమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్రతో ప్రాణహితపై ఒప్పందం చేసుకున్నామని, జాతీయ ప్రాజెక్టుగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 8 అనుమతులు వచ్చాయని.. ఇంకా రావాలని ప్రాణహితను ఏ సీమాంధ్ర వ్యక్తి వ్యతిరేకించడంలేదని సీఎం తెలిపారు. అలాంటప్పుడు పోలవరంను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కలిసుంటేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. విడిపోతే కరెంట్‌, ఇరిగేషన్‌ ను బ్యాలెన్స్‌ చేయడం కష్టమన్నారు. పోలవరానికి సంబంధించి ఛత్తీస్‌ఘడ్‌, ఒడిషా, ఖమ్మం జిల్లాలతో సరిహద్దు సమస్యలు ఉన్నాయని అన్నారు. విడిపోతే ముంపుగ్రామాలతో సమస్య రాగలదన్నారు. అందుకే తాను సమైక్యం కోరుకుంటునని ఆయన చెప్పారు.రూ. 60 వేల కోట్లు ఖర్చు చేస్తేనే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తన ప్రసంగాన్ని పదే పదే తెలంగాణ ప్రాంత నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో… నిజాలు చెబితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని, నిజాలను జీర్ణించుకునే ధైర్యం కావాలని, తాను ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాటినే చెబుతున్నానని సీఎం కిరణ్‌ తెలిపారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి 44,150 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. 11 లక్షల 13వేల ఎకరాల కోసం రూ.12,700లతో చేపట్టిన ప్రాజెక్టులు వృథాగా ఉన్నాయన్నారు. 1956 నుంచి ఇప్పటివరకు ఆంధ్రా ప్రాంతం అభివృద్ధి చేసింది 40.96 శాతం.ఆంధ్రా ప్రాంతంలో ఇరిగేషన్‌ కింద 31,360 కోట్లు ఖర్చు జరిగింది. 1956 నుంచి 1983 వరకు రూ. 1,470 కోట్లు ఇరిగేషన్‌ కింద ఖర్చు అయిందన్నారు. కృష్ణా నది కింద ఉన్న ఆయకట్టుకు నీరు ఎలా ఇవ్వాలన్న దానిపై ఢిల్లీ ఐఐటీ సాయంతో అంచనా వేశారు. 1956లో రాష్ట్రంలో సాగు 69 లక్షల 65 వేల ఎకరాలు. 11.13 లక్షల ఎకరాల సాగునీటి కోసం రూ. 12,700 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు వృథా అవుతాయి.ప్రాజెక్టులపై ఏకీకృత వ్యవస్థ లేకపోతే ఇబ్బంది తప్పదన్నారు. ఏకీకృత వ్యవస్థ ఉన్నందునే వరద సమయంలో ఇంజినీర్ల నిర్ణయాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిలవగలిగిందని చెప్పారు. విభజన జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి నిర్వహణ కష్టమవుతుందన్నారు. విద్యుత్‌, సాగునీటి అవసరాలకు ప్రాజెక్టు నీటిని సక్రమంగా వాడుకోవాల్సి ఉంటుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సీమాంధ్రలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రయత్నిస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు పదే పదే ప్రసంగానికి అడ్డు తగలడంతో కిరణ్‌ స్పందిస్తూ.. మనమంతా అన్నదమ్ముల్లాంటి వాళ్లమని, కలిసి ఉండాల్సి ఉందని, కలిసి జీవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం చేతికి వెళ్తే ఇబ్బందులు వస్తాయని సీఎం వివరించారు. విభజన జరిగితే ప్రస్తుతం కడుతున్న ప్రాజెక్టులు వథా అవుతాయని, తెలంగాణ ప్రాజెక్టులకు నీరు రాదని సీఎం అవేశంగా చెప్పారు. తెలంగాణలో కరెంట్‌ ఉత్పత్తి తక్కువ ఉందని, తెలంగాణ రైతులకు కష్టాలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఇప్పటికీ 33 వేల కోట్లు కరెంట్‌ సబ్సీడికి ఖర్చు పెట్టామని… ఇందులో తెలంగాణ ప్రాంత రైతులకు 19 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం వివరించారు. సింగరేణి నుంచి ఆంధ్రాకు ఒక టన్ను బొగ్గు కూడా కేటాయించలేదని ముఖ్యమంత్రి అన్నారు. తమ బొగ్గు సీమాంధ్రకు తరలిస్తున్నారని పదేపదే ఆరోపణలు చేయడం తప్పని, సింగరేణి బొగ్గు కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం చేయదని, కేంద్రం చేస్తుందని సీఎం తెలిపారు. సింగరేణి బొగ్గును ఇతర రాష్టాల్రకు కేటాయిస్తోందని, ఆంధ్రా ప్రాంతానికి చేయలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సభలో సభ్యులనుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సభ్యులు పోడియం వద్దకు వెళ్లి అభ్యంతరం చెప్పడంతో ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. సభ్యులను తమ తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని, అందరి అభిప్రాయాలకు సమయం ఇస్తామని సభాపతి నాదెండ్ల మనోహర్‌ సూచించారు. కిరణ్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సభాపతి ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను 10 నిముషాలపాటు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *