విభజనతో సంబంధం లేదు : భన్వర్‌లాల్
హైదరాబాద్, జనవరి 24 (జనంసాక్షి) :
నెలరోజుల్లోగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని రాష్ట్ర పధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండానే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ చేస్తారని తెలిపారు. జనవరి 25 (శనివారం) జాతీయ నాలుగో ఓటర్ల దినోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యామూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్త హాజరవుతారని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలో మీడియాతె మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విద్య, ఉద్యోగం, కుటుంబం కన్న ఓటు ఎంతో విలువైనదని దానిని సద్వినియోగం చేసుకోవాలని భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్రంలో 76 లక్షల మంది కొత్తగా ఓటర్ల పేరులు నమోదు చేసుకున్నారని వీటిని పరిశీలించిన అనంతరం 33 లక్షల పేర్లను తొలగించడం జరిగిందని అన్నారు. వీటికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి మొదటి దశలో ఐదువంతు స్మార్టు కార్డులను ఇస్తామని అన్నారు. ఓటర్ పేరు నమోదుకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుగాను ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని గ్రామీణస్థాయిలో రంగోలి, వక్తృత్వ వ్యాసరచన, పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓటర్ తన ఐడి స్టాటస్‌ను తెలుసుకునేందుకు 9246280027 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేస్తే ఆర నిమిషంలో జవాబు వస్తుందని అన్నారు.
నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్




