తెలంగాణ ఇచ్చేస్తాం : దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 24 (జనంసాక్షి) :
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ మాట తప్పబోదని స్పష్టం చేశారు. పునర్విభజన బిల్లుపై మాట్లాడేందుకు శుక్రవారం ఢిల్లీకి రావాలంటూ తాను ముఖ్యమంత్రికి కిరణ్‌కు ఫోన్ చేశానని, అసెంబ్లీలో చర్చ జరుగుతున్నందున తాను ఢిల్లీకి రాలేనని తెలిపారన్నారు. శాసనసభ ఈనెల 30వరకు కొనసాగనున్నందున వీలైతే జనవరి 26న ఢిల్లీ వచ్చేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి చెప్పారని దిగ్విజయ్ అన్నారు. సీమాంధ్రలో సమైక్యం మా నినాదం కాదు.. మా విధానం అంటూ ఏర్పాటైన ఫ్లెక్సీల వెనుక సీఎం హస్తం ఉందనే ప్రచారం కొనసాగుతోంది. విభజన బిల్లుపై శాసనసభలో చర్చకు గడువు పెంచకపోతే గురువారమే శాసనసభలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందరూ ఊహించారు. అయితే అనూహ్యంగా విభజన బిల్లుపై చర్చించే గడువును ఈ నెల 30వరకు పొడిగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం వెలువడడంతో కిరణ్ వెనకడుగు వేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సమైక్య నినాదం పేర ప్రజల్లోకి వెళ్లాలని కిరణ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కిరణ్ పార్టీపై తిరుగుబాటు చేస్తూనే వస్తున్నారు. శాసనసభలో బిల్లు ముసాయిదాపై జరిగిన చర్చలో పాల్గొన్న కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి ఇక కాంగ్రెస్‌ను వీడడం ఖాయమనే అనిపిస్తోంది. విభజన బిల్లుపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని దిగ్విజయ్ ఆహ్వానించిన కిరణ్ తాను రానంటూ ఎదురు తిరగడంతో ఇక కొద్ది రోజుల్లోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా వీడడం తథ్యమనే వాదనలు వినవస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలను దిగ్విజయ్‌సింగ్ తిప్పికొట్టారు. కిరణ్‌ను కాంగ్రెస్‌ను వీడబోడని తేల్చిచెప్పారు.
మాట నిలబెట్టుకుంటాం




