Wednesday, 4 November 2026

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

చర్చలు విఫలం.. సమ్మె దిశగా సంఘాలు
హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి) :
ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 27 నుంచి సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను పదో పీఆర్సీ ప్రకారం అమలుచేయడంతో పాటు మధ్యంతర భృతిని 24శాతం పొందిన తర్వాత ఆర్టీసి ఉద్యోగులు యాజమాన్యంతో అమితుమీకి దిగారు. ఇరవై రోజుల క్రితమే తమ డిమాండ్లను అమలు చేయాలని, నూతనంగా పదో పిఆర్‌సిని అమలు చేయాలని, దీనికి ముందు మధ్యంతర భృతిని సాధించేందుకు నోటీస్‌ ఇచ్చాయి. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌తోపాటు ఎంప్లాయీస్‌ యూనియన్‌లు సంయుక్తంగా ఈనోటీస్‌ ఇస్తూ డిమాండ్లు పరిష్కరించక పోతే 27వతేదీ నుంచి సమ్మెకు దిగనున్నామని బహిరంగంగా ప్రకటించారు. దీంతో కదిలిన యంత్రాంగం ఎండి పూర్ణచందర్‌రావు కార్మిక సంఘాలతో గురువారం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. సంస్థ ఇప్పటికే కోట్లాది రూపాయల నష్టాల్లోకూరుకు పోయిందన్నారు. మనుగడకే ప్రశ్నార్థకంగా మారితే నేడు ఇలాంటి చర్యలు తీసుకోవడం సైరంది కాదని చెప్పారు. దీనికి ససేమిరా అన్న కార్మిక సంఘాలు సమ్మెకు దిగకతప్పదని హెచ్చరించారు. శుక్రవారం తిరిగి ప్రభుత్వం పక్షాన రోడ్డు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గుర్తుంచుకుని సమ్మెకు దిగవద్దన్నారు. త్వరలోనే డిమాండ్లను పరిష్కరించేందకు ప్రయత్నిస్తానన్నారు. ఈసారికి సహకరిస్తే కొద్ది రోజుల్లోనే సంస్థ మనుగడ మెరుగు పడుతుందని బొత్స పేర్కొన్నారు. అయితే కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ నేడున్న పరిస్థితులను చూసి వేతనాలు పెంచాల్సిన బాద్యత ప్రభుత్వంపైన ఆర్టీసి యాజమాన్యంపై కూడా ఉందన్నారు. వస్తున్న జీతాలు సరిపోక రెండు పూటల కుటుంబం కడుపు నిండా తినే పరిస్థితి లేదన్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే సంస్థ మనుగడను కాపాడేందుకు తాముకూడా ప్రయత్నిస్తామన్నారు. ఆర్టీసిని ఇటీవలే కార్మికులు అహర్నిశలు కృషిచేయడం వల్లే ఏడు కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకున్నామ న్నారు. ఇంకా ఇంకా చేసేందుకు కార్మికులు సిద్దంగానే ఉన్నారని అయితే ప్రభుత్వంతోపాటు, యాజమా న్యం కార్మికుల బాగోగులను పట్టించుకోకపోతే ఎలా అని కార్మిక సంఘాల నేతలు బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. డిమాండ్లను పరిష్కరించని పక్షంలో సమ్మెకు పోవడం ఖాయమని తేల్చి చెప్పిన తెలంగాణా మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు, ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు బయటకు వచ్చేశారు. అయితే చివరి క్షణంలో మంత్రి మాత్రం రెండు రోజులు సమయమిస్తే చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని, ఏమాత్రం తొందరపడి సమ్మెలోకి పోవద్దని సూచించారు. అందుకు ససేమిరా అన్న యూనియన్‌ నాయకులు అశ్వత్తామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు సమస్యలు పరిష్కరించాల్సిందేనని అన్నారు. లేకుంటే సమ్మెకు దిగక తప్పదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *