Wednesday, 4 November 2026

సీఎంది రాజ్యాంగ విరుద్ధమైన వైఖరి

తిప్పి పంపే అధికారం ఆయనకు లేదు : కోదండరామ్‌
హైదరాబాద్‌, జనవరి 25 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది రాజ్యాంగ విరుద్ధమైన వైఖరని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శనివారం నగరంలో నిర్వహించిన నాలుగో తరగతి ఉద్యోగుల డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిల్లు రాష్ట్రానికి వచ్చిన 44 రోజుల తర్వాత ముఖ్యమంత్రి అందులో తప్పులున్నాయని పేర్కొనడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును ప్రభుత్వం పక్షాన సభలో ప్రవేశపెట్టినప్పుడు సభా నాయకుడిగా ఉన్న వ్యక్తి దానిని ఎలా వ్యతిరేకిస్తారని ఆయన ప్రశ్నించారు. కిరణ్‌కు విభజనపై భిన్నమైన అభిప్రాయాలుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సభ్యుడిగా మాట్లాడాలని సూచించారు. కిరణ్‌కు రాజ్యాంగంపై అవగాహన, గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగం ప్రమాణం చేసిన వ్యక్తి విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన రాజ్యాంగాన్నే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్‌ 77 ప్రకారం ముసాయిదా బిల్లును తిప్పి పంపాలంటూ సీఎం స్పీకర్‌కు నోటీసివ్వడంలో ఆయన పరిధిని దాటి వ్యవహరించాడని మండిపడ్డారు. ముసాయిదాను తిప్పిపంపే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు. ముసాయిదాపై చర్చకు ధైర్యం చాలని సీఎం దాన్ని తిప్పిపంపడమే తన చివరి బంతికి భావిస్తే ఆయన అవగాహన రాహిత్యానికే నిదర్శనమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చర్యల ద్వారా తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకి ఉండబోదని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సామాన్యులే నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీఎన్‌జీవోల సంఘం కేంద్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *