Tuesday, 3 November 2026

ఉసురు తీసిన కిరణ్‌ వ్యాఖ్యలు

ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని యువకుడి ఆత్మహత్య
బెల్లంపల్లి, జనవరి 26 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా ఉంది కాబట్టి రాష్ట్రపతికి తిప్పిపంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌కు నోటీసివ్వడం, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడటం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. కిరణ్‌ వ్యాఖ్యలతో నిండు ప్రాణం బలైంది. కిరణ్‌ వ్యాఖ్యలతో ఇక తెలంగాణ రాదేమోనని కలత చెంది ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్‌ బస్తీికి చెందిన పిన్న రాజ్‌కుమార్‌ (25) ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికంగా కిరణాషాపులో పనిచేస్తూ జీవనం సాగించే రాజ్‌కుమార్‌ అసెంబ్లీ సమావేశాలను రోజూ టీవీలో చూస్తూ కలత చెందేవాడు. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్ర నాయకులు వ్యతిరేకించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడదనే బెంగతో ఆదివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో కిరోసిన్‌ పోసుకొని స్థానిక తెలంగాణ దీక్ష శిబిరం సమీపంలో నిప్పంటించుకున్నాడు. ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజ్‌కుమార్‌ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కాగా రాజ్‌కుమార్‌ ఇటీవల జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. మృతుడికి భార్య పద్మ, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *