ఆదేశ సూత్రాలు పాటించాలి : కోదండరామ్
హైదరాబాద్, జనవరి 26 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యాంగబద్ధుడిగా వ్యవహరించాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని టీఎన్‌జీవోస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ నేతృత్వంలో సీమాంధ్రులు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన అన్నారు. ఎవరు ఆపినా, అడ్డుకున్నా తెలంగాణ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. పర్మిట్‌లేని బస్సులా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. కొన్ని స్వార్థ శక్తులు తెలంగాణ బిల్లుపై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. ఆదేశ సూత్రాలకు లోబడే పాలన సాగించాలని, తెలంగాణ ముసాయిదాను కూడా ఈ మేరకే తిప్పిపంపాలని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి రూల్ 77 ఇప్పుడు గుర్తుకువచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును రూల్ 77 కింద తిప్పిపంపలేరనే విషయాన్ని విస్మరించి ప్రజల్లో అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమను పాలకులు దోచుకుంటున్నారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వారిని ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దేవిప్రసాద్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




