వరంగల్, జనవరి27(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపమని, ఆయన ఈ నెల ఆఖరి వరకే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం పంపిన బిల్లుపై గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. వరంగల్‌లో మాట్లాడుతూ ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లు అసమగ్రంగా ఉందన్న సీఎం గడువు పెంపు కోరడం అవివేకమేనని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చ జరిపాక కూడా అసమగ్రంగా ఉందనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్రపతి పంపిన బిల్లును తప్పుపట్టడం అహంకారపూరితమైన చర్య కాక మరోటి కాదన్నారు. విస్తృత చర్చ జరిగితే అంతా పూర్తయ్యేవరకు నిశ్శబ్దంగా ఉండి ఇప్పుడు బిల్లును వ్యతిరేకించడంలో అర్థమేంటని ఆయన ప్రశ్నించారు. చూస్తుంటే ఇదంతా కిరణ్ ఆడుతున్న డ్రామాలాగా ఉందన్నారు. కావాలనే ఇలా చేస్తున్‌నారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని కూడా అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర మంత్రులు కూడబలుక్కునే మాట్లాడుతున్నారా చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ్యుడిగా తన అభిప్రాయాలను కిరణ్ కుమార్ రెడ్డి చెప్పవచ్చునని, అయితే ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన వచ్చినప్పుడు గంభీరంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పడంపై స్పందిస్తూ ఆ వైఖరి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతమా, పార్టీదా చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ అంశం చివరి అంకంలో కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయాలు ఎందుకు చెబుతున్నారని ఆయన అడిగారు. అధిష్టానం ఓ నిర్ణయం తీసుకున్నాక దానిని వ్యతిరేకించడం సబబు కాదన్నారు. ముఖ్యమంత్రి చెప్పేది నిజమా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పేది నిజమా తేలాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని కోదండరాం ధ్వజమెత్తారు. శాసనసభలో సభ్యులు తెలంగాణ, సీమాంధ్రగా విడిపోయారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితితో తెలంగాణ ఆపడం అసాధ్యమన్నారు. సీఎంకు మంత్రివర్గంలోని మంత్రులే బాసటగా నిలవడం లేదని ఎద్దేవా చేశారు.
కిరణ్ ఆరిపోయే దీపం కిరణ్ ఆరిపోయే దీపం …




