Monday, 2 November 2026

భక్తజన సంద్రంగా మేడారం

వరంగల్‌,జనవరి30: మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఇక్కడ భక్తజన సంద్రంగా మారింది. జాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో పరిసరాలు  కిటకిటలాడుతున్నాయి. అయితే గతానికి భిన్నంగా ఆలయ కమిటీ లేకుండానే ఈ సారి జాతర జరుగబోతోంది. ధర్మకర్తల మండలిని గానీ, ఉత్సవ కమిటీని గానీ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మేడారం జాతర జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందినందున దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించే వీలుంది. ఇందుకోసం దేవాదాయశాఖలో కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషర్‌ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం, లేదా కలెక్టర్‌కు జాతర నిర్వహణ బాధ్యతలు అప్పగించొచ్చని దేవాదాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు.  చరిత్రలో తొలిసారిగా ధర్మకర్తలమండలి లేకుండానే ఉత్సవం జరగనుంది. రెండేళ్ల క్రితం నియమితులైన నాలి కన్నయ్య నేతృత్వంలోని ధర్మకర్తల మండలి పదవీ కాలం ఈనెల ఎనిమిదితో ముగిసిపోయింది. నూతన కమిటీ ఏర్పాటుకు అధికారులు గానీ, ప్రభుత్వం గానీ ముందస్తుగా దృష్టిసారించలేదు. ఫలితంగా ఈ సారి ధర్మకర్తల మండలి , ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం లేకుండాపోయింది. ఎనిమిదిన పదవీకాలం ముగియగా 28న అధికార పార్టీ నాయకులు హైదరాబాద్‌కు వెళ్లి ధర్మకర్తల మండలిపై రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ ముక్తేశ్వర్‌రావును కలిశారు. ధర్మ కర్తల మండలిని నియమించాలంటే కనీసం 40 రోజుల సమయం అవసరమవుతుందని, ప్రస్తుతం జాతరకు 20 రోజుల సమయం కూడా లేనందున నిర్ణయం తీసుకోలేమని అన్నారు. జాతర జరిగే నాలుగు రోజులకు కనీసం ఉత్సవ కమిటీ అయినా నియమించాలని కోరినా కమిషనర్‌ వీలుకాదని చెప్పారు. గతంలో నిమించించిన కమిటీలకు సంబంధించిన వాటిపై హైకోర్టులో కేసులున్నందున ప్రభుత్వం ఉత్సవ కమిటీలను నియమించడం ఏ మాత్రం వీలు కాదని చెప్పినట్లు తెలిసింది. మేడారం జాతర ధర్మకర్తల మండలి పదవీ కాలం ముగిసిన వెంటనే విషయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్‌కు తెలియజేశారు. తక్కువ కాలంలో ధర్మకర్తల మండలి నియమించే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యపై మా శాఖ ఉన్నతాధికారులు గానీ, ప్రభుత్వం గానీ ఏ నిర్ణయం తీసుకుంటుందో నాకు పూర్తి సమాచారం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *