Monday, 2 November 2026

అవినీతి పరుల చిట్టా చదివిన కేజ్రీవాల్‌

జాబితాలో జగన్‌
న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) :
ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోమారు అవినతి పరుల చిట్టా విప్పింది. అందులో మన రాష్ట్రానికి చెందిన కడప ఎంపీ, వైఎస్‌ జగన్‌ పేరు చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం అవినీతి నేతలు అంటూ చిట్టా విప్పారు. జన్‌ లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు ఎఎపి జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కేజీవ్రాల్‌ దేశంలో అవినీతి నేతల పేర్లను చదివి వినిపించారు. కేజ్రీవాల్‌ చదివిని లిస్టులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ, కేంద్రమంత్రులు సుశీల్‌ కుమార్‌ షిండే, కపిల్‌ సిబాల్‌, మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, మాయావతి తదితరుల పేర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేరు ఉంది. రాహుల్‌, మోడీలు తమ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని, ఇప్పుడు వారు గెలిస్తే అదంతా ప్రజల నుండి వసూలు చేస్తారని, ఇక వారి నుంచి మంచి పాలన ఎలా ఆశిస్తామని కేజీవ్రాల్‌ ప్రశ్నించారు. ఒక్క అవినీతి నేత కూడా లోకసభ లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేజీవ్రాల్‌ చదివిన లిస్టులో.. సుశీల్‌ కుమార్‌ షిండే, వీరప్ప మొయిలీ, సురేష్‌ కల్మాడీ, సల్మాన్‌ ఖుర్షీద్‌, కనిమొళి, అళగిరి, ములాయం సింగ్‌ యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, నవీన్‌ జిందాల్‌, నితిన్‌ గడ్కరీ, ప్రఫుల్‌ పటేల్‌, నరేంద్ర మోడీ, కపిల్‌ సిబాల్‌, ఎ రాజా, చిదంబరం, మాయావతి, యడ్యూరప్ప, రాహుల్‌గాంధీ, శ్రీ ప్రకాశ్‌ జైస్వాల్‌, పవన్‌ కుమార్‌ బన్సాల్‌, అనంత్‌ కుమార్‌, అనూ టాండన్‌, తరుణ్‌ గొగొయ్‌, ప్రఫుల్‌ పటేల్‌, హెచ్‌డి కుమారస్వామి, కమల్‌ నాథ్‌, రాహుల్‌ గాంధీ, అను టండన్‌, జికె వాసన్‌, వైయస్‌ జగన్‌ తదితరులు ఉన్నారు. తాము అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కేజ్రీవాల్‌ ప్రకటించారు. తమ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోలేదని కూడా అన్నారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 16న ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 13నుంచి 16 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చలు జరుపుతారు. చివరి రోజున ప్రజలను కూడా చర్చలకు ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *