హైదరాబాద్, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా సోమవారం ఢిల్లీకి పంపడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఏర్పాట్లు పూర్తి చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి శనివారమే బిల్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. రాష్ట్ర శాసనసభ, మండలిలో సభ్యులు ముసాయిదాపై లిఖిత పూర్వకంగా, మౌఖికంగా చెప్పిన అభిప్రాయాలతో పాటు సవరణలు కోరుతూ ప్రతిపాదించిన ప్రతులను క్రోడీకరించి ముసాయిదా సిద్ధం చేశారు. ఈమేరకు సభ్యుల ప్రసంగాలతో పాటు లిఖితపూర్వక అభిప్రాయాలు, సవరణలను ఇంగ్లిష్, హిందీ భాషల్లోకి ఇప్పటికే అనువదించారు. ముసాయిదాపై మరిన్ని వివరాలు అందజేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి రాజసదారామ్ ఆదివారం చీఫ్ సెక్రటరీ పీకే మహంతితో భేటీ అయ్యారు. తమ కార్యాలయం నుంచి వచ్చిన ముసాయిదా ప్రతులపై ఆయన సందేహాలను సదారామ్ నివృత్తి చేశారు. ముసాయిదాను ఆరు బండిల్స్‌గా ప్యాక్ చేసి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపుతున్నారు. వీటి వెంట నలుగురు అధికారులు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ విమానం సోమవారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరుతుందని మహంతి తెలిపారు. ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులకు అందజేస్తారు. వారు ముసాయిదాను రాష్ట్రపతికి పంపుతారు. ఆయన పరిశీలన తర్వాత ముసాయిదా కేంద్ర ప్రభుత్వానికి చేరుతుంది. మరోవైపు రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చిన వెంటనే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తెలంగాణ తుది ముసాయిదా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి వ్యక్తం చేసిన అభిప్రాయాలు, కోరిన సవరణలను క్రోడికరించి వాటిని తుది ముసాయిదాలో చేర్చాలా లేదా అనే అంశాలపై చర్చిస్తారు. మరోవైపు తెలంగాణ బిల్లుకు ఏ ఏ రాజకీయ పక్షాలు మద్దతిస్తాయి, బీజేపీ కలిసి వస్తుందా లేదా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం తెలంగాణ బిల్లు పెట్టండి.. బేషరతుగా మద్దతు ఇస్తామన్న బీజేపీ అగ్రనేతల స్వరం మారుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బేషరతు అన్న పదాన్ని ఉపయోగించినందుకు లోక్‌సభలో ఆ పార్టీ నాయకురాలు సుష్మస్వరాజ్‌ను మందలించినట్లు సమాచారం. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొంతు నుండి వెలువడిన సమన్యాయం అనే పదం ఇప్పుడు బీజేపీ నేతల గొంతు నుండి వెలువడుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీలు పొత్తు కుదుర్చొకుని పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో చంద్రబాబు ఒత్తిడికి బీజేపీ అగ్రనాయకత్వం వెనక్కు తగ్గిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే, కట్టె విరక్కుండా.. పాము చావకుండా రాష్ట్ర విభజన విషయంలో వ్యవహరించాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. బిల్లుకు మద్దతు ఇస్తామన్న సంకేతాలు పంపుతూనే సాంకేతిక అంశాలను తెరపైకి తెచ్చి బిల్లు కొంచెం వెనక్కు పోయేలా వ్యవహరించాలని బీజేపీ యోచిస్తోంది. యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులో సవరణలు ప్రతిపాదించి అవసరమైతే పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వైఖరి మారుతున్న గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కూడా క్రియ విషయంలో వడివడిగా అడుగులు వేస్తోంది. శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యుల అభిప్రాయాలతో కూడిన నివేదిక ఇప్పటికే శాసనసభ కార్యదర్శి నుండి ప్రభుత్వ కార్యదర్శికి చేరింది. సోమవారం ప్రత్యేక దూత ద్వారా తెలంగాణ బిల్లు హోంశాఖకు చేరుతోంది. నాలుగవ తేదీన విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన జీవోఎం సమావేశం కానుంది. ఇందులో శాసనసభ నుంచి వచ్చిన బిల్లుపై చర్చించి కొన్ని సవరణలు చేసి తుది బిల్లును రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈనెల 5వ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టేలా కాంగ్రెస్ వ్యూహరచనలో నిమగ్నమైంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలంటే హాజరైన సభ్యుల్లో మెజార్టీ ఉంటే చాలు. రాజ్యాంగ సవరణలు చేసే సందర్భంలో మూడింట రెండింట మెజార్టీ తెలంగాణ బిల్లుకు అవసరం లేదు. దీంతో ఇచ్చిన హామీని అమలు చేశామని, మాట తప్పలేదని కాంగ్రెస్ ప్రజలకు స్పష్టంగా చెప్పేలా ప్రయత్నించనుంది. ఒకవేళ బీజేపీ విభజనకు బిల్లు అడ్డుపడి ప్రజలు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తే అదే వ్యూహాన్ని బీజేపీపై సంధించేలా కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం. బిల్లుపై ఓటింగ్ జరిగే సందర్భంలో బీజేపీని వాకౌట్ చేసేలా చేసి బిల్లును సభలో ఉన్న సభ్యుల ద్వారా ఆమోదింపజేసుకొని బీజేపీని దోషిగా నిలబెట్టాలని అధిష్టానం యోచిస్తోంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఎలాగైనా బిల్లును ఆమోదింపజేసి బీజేపీకి చెక్ చెప్పాలని కాంగ్రెస్, సాంకేతిక అంశాలను ఆసరాగా చేసుకొని బిల్లు ఆమోదం పొందకుండా చేసి ఎలాగో తాము అధికారంలోకి వస్తామన్న బీజేపీ ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరిగితే కానీ ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
నేడు ఢిల్లీకి టీ బిల్లు





