Tuesday, 3 November 2026

బాబులు (ఎడ్‌ది రేట్‌) కిరికిరి

విభజన ఆపాలని రాష్ట్రపతిని కలుస్తా : బాబు
బ్రహ్మాస్త్రం ప్రయోగించా : కిరణ్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర బాబులు కిరికిరి రాజకీయాలకు పదను పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రక్రియ సరిగా లేదని, ప్రజల మధ్య విద్వేషాలు రగల్చి కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల రాజకీయం చేస్తోందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలువనున్నారు. ఆయన శనివారమే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరారు. తనతో పాటు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలను వెంటబెట్టుకొని వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బాబు నిర్ణయించుకున్నారు. ఈమేరకు సోమవారం ఉదయం ఇరు ప్రాంతాల నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి బయల్దేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జాతీయ నాయకులకు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు రెండు రోజులు ఢిల్లీలో ఉండేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై తన అక్కసు వెల్లగక్కాడు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని ముఖ్యమంత్రి మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం పంపిన రాష్ట్ర పునర్విభజన బిల్లును మూజువాణి ఓటుతో తిరస్కరించి పంపామని అవే బీరాలు పలికారు. మూజువాణి ఓటే సమైక్య రాష్ట్రానికి బ్రహ్మాస్త్రం అని అన్నారు. ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూజువాణి ఓటుతో తిరస్కరించిన తీర్మానం చిన్న కాగితం కాదని స్పష్టం చేశారు. అయితే తెల్లకాగితమైతే టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. తలపండిన నాయకులు, మేధావులమని చెప్పుకునే వారు కూడా మూజువాణి ఓటు అంటే తొండి ఆట అని వక్రీకరించారని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. తాము సమైక్యవాదులమని, తమ విధి విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. అసెంబ్లీ చేసిన తీర్మానం అంశాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తాను పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ బిల్లును తిప్పి పంపుతానని పేర్కొన్నానని, చెప్పిన మాట ప్రకారం బిల్లును ఓడించి పంపి మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. ఈ తీర్మానం వెనక రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వారు ఎంతమంది త్యాగాలు, అన్ని వర్గాల కష్టం, శ్రమ, ఆత్మాభిమానం దాగున్నాయని అన్నారు. బిల్లుపై రాష్ట్రపతి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందిన తర్వాతే పార్లమెంట్‌కు పంపించడం జరుగుతుందన్నారు. శాసనసభలో వీగిపోయిన బిల్లుపై రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో వేచిచూద్దామన్నారు. ఈనెల 4, 5 తేదీల్లో రాష్ట్రపతి కలవడానికి అపాయింట్‌మెంట్‌ కోరామని, ఏదో ఒక తేదీలో ఆయనను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతామన్నారు. తాము రాష్ట్రపతిని కలవడానికి వెళుతున్నందున సమైక్యాంధ్ర కోరుకునే వారు తమతో కలిసి రావాలని, లేనిపక్షంలో వేర్వేరుగా కలిసిన అభ్యంతరం లేదన్నారు. మరో రెండు మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయని, ఎన్నికల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా, విడదీయాలా అన్న నిర్ణయాన్ని ప్రజలు ప్రకటిస్తారని, అందుకు రాష్ట్ర ప్రజలకు అవకాశం ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. బిల్లు సమగ్రంగా రాలేదని, అందుకే చట్టసభల్లో బిల్లును మూజువాణి ఓటుతో ఓడించడం జరిగిందని చెప్పారు. పార్లమెంట్‌, శాసనసభల్లో 80 నుంచి 90 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందుతాయన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. లోక్‌పాల్‌, ఆహార భద్రత బిల్లుతో పాటు ఎన్‌డిఎ పాలనలో మూడు కొత్త రాష్ట్రాల ఏర్పాటు మూజువాణి ఓటుతోనే బిల్లులు ఆమోదం పొందాయన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో శాసనసభల తీర్మానాలను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని గుర్తుచేశారు. మూజువాణి ఓటు అంటే సవాల్‌ చేయబడని, వ్యతిరేకించని తీర్మానమనే వాస్తవం తెలియనివారు వక్రీకరణలకు పాల్పడుతున్నారని సిఎం విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉందని అన్నారు. రాష్ట్రంలో మాదిరిగా మూజువాణి ఓటుతో బిల్లును పార్లమెంట్‌ ఆమోదిస్తే ఏంచేస్తారని అడిగిన ప్రశ్నకు అదీ చూద్దామని సిఎం బదులిచ్చారు. తలపండిన నాయకులు, మేధావులు వారు కూడా స్వార్థరాజకీయ ప్రయోజనాలను ఆశించి విభజన విషయంలో విధానాలను మార్చుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం విడిపోతే మూడు ప్రాంతాలు నష్టపోతాయని సిఎం ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో సమైక్యవాదులు విభజన వాదులుగా, విభజనవాదులు సమైక్యవాదులుగా మారారని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే అసెంబ్లీలో మాదిరిగా టిడిపి, వైకాపాలు ఢిల్లీలో కూడా తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ వరకు ఈ బిల్లు వెళుతుందా చూద్దామని, మరో ఇరవై రోజుల్లో ఏమవుతుందో తేలిపోతుందని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తాను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించలేదనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అసెంబ్లీలో ఎవరు ఎప్పుడు మాట్లాడాలనేది ఆయనకు బాగా తెలుసునని అన్నారు. సమైక్యవాదాన్ని రాష్ట్రపతి పరిగణలోకి తీసుకుంటారని నమ్మకం తనకుందని, ఎవరు ఏమనుకున్నా తాను సమైక్యవాదినేనని సిఎం స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *