హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో భాజపా ఇచ్చిన మాట తప్పదని ఆ పార్టీ జాతీయనేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కొంపల్లిలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణకు భాజపా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా తమ ముఖ్యమంత్రిని సరిదిద్దుకోవాలని సూచించారు. తెలంగాణలో వెయ్యి మంది, సీమాంధ్రలో 360 మంది మరణాలకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని ప్రతిపాదిస్తారు. కానీ ఆ పార్టీ సీఎం వ్యతిరేకిస్తారని విమర్శించారు. అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఆ పార్టీ అధిష్ఠానమే చెప్పిందట అని అన్నారు. విభజన విషయంలో రాజకీయ నాయకత్వం పరిపక్వత చూపించాలని కోరారు.




