Tuesday, 3 November 2026

ప్రధానిని కలిసిన కేసీఆర్‌ బృందం

తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని హామీ
హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 : టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో 40 మంది సభ్యులతో కూడిన బృందం మంగళవారం ఉదయం  ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలుసుకుంది. తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్‌ సమావేశంలోనే ప్రవేశపెట్టాలంటూ ప్రధానమంత్రికి బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంపై గవర్నర్‌ పెత్తనాన్ని, ఉద్యోగుల, పెన్షనర్ల కంపెనీ విధానంపై, విద్యుత్‌, విద్య, తదితర అంశాలపై బిల్లు ముసాయిదాలో పొందుపరిచిన విధానం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్‌ ప్రధాన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రధాని తెలంగాణకు తాముకట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. విభజన తరువాత కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు దేశంలోనే ఉంటాయని, ఈ పరిస్థితుల దృష్ట్యా సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని ప్రధాని కేసీఆర్‌ను కోరినట్టు సమాచారం. విద్యుత్‌, విద్య తదితర అంశాలపై తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను కేంద్రహోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేసీఆర్‌ ప్రధానికి సవివరంగా స్పష్టం చేశారు. బిల్లు ముసాయిదాలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉన్న అన్ని అంశాలపై కేసీఆర్‌ సవరణలు ప్రతిపాదించారు. వీటిని సవరిస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరదన్నారు. అన్నింటిని సావధానంగా విన్న ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు కేసీఆర్‌ మీడియాకు తెలిపారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తీరనున్న దృష్ట్యా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్టు కేసీఆర్‌ తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు స్వామిగౌడ్‌, జితెందర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, ఎంపీలు వివేక్‌, మందాజగన్నాథం, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదేలు, భిక్షపతి, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహమూద్‌అలి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *