Tuesday, 3 November 2026

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ఆందోళన

సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌
పోలీసుల అరెస్టు, ఉద్రిక్తత
హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 : విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మంగళవారం విద్యుత్‌ సౌధ ఎదుట కాంట్రాక్ట్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. భారీ సంఖ్యలో కాంట్రాక్ట్‌ కార్మికులు అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్మికులు, విద్యుత్‌ సౌధను ముట్టడించే ప్రయత్నం చేశారు.  దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అరెస్టులను కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కాంట్రాక్ట్‌ కార్మికల సంఘం నేత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా థర్మల్‌, హైడల్‌ విద్యుత్‌ కేంద్రాలలో 4,500 మంది వరకు కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించి పర్మినెంట్‌ ఉద్యోగుల మాదిరిగా సౌకర్యాలను కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో  కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థ వల్ల కాంట్రాక్టర్లు లబ్ధిపొందుతున్నారే తప్ప కార్మికులకు మాత్రం నష్టం వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు. తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల మాదిరిగా తమ సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలన్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం, యాజమాన్యం తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని వారు కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *