
జంతర్ మంతర్ వద్ద చివరి ప్రయత్నాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన కిరికిరిని కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రవిభజన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో జరగడం లేదంటూ మంగళవారం జంతర్‌మంతర్ వద్ద దీక్షకు పూనుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బిల్లుపై 9000లకు పైగా సవరణలు వచ్చాయని వాటిపై అసెంబ్లీ చర్చించలేదన్నారు. ఇవన్నీ పరిశీలించకుండా అసమగ్రంగా ఎలా ప్రవేశ పెడతారని ఆయన ప్రశ్నించారు. విభజన జరిగితే సీమాంధ్రకన్నా తెలంగాణకే ఎక్కువ నష్టం జరుగుతందని మరోమారు అన్నారు. కేంద్రం తెలంగాణ ప్రతినిధిలాగా ప్రవర్తిస్తోంది. రాష్ట్రంలో అధికశాతం ప్రజలు రాష్ట్ర విభజనను ఇష్టపడడం లేదన్న విషయం మర్చిపోతోందన్నారు. శాసనసభ తిరస్కరించాక దేశంలో ఏ రాష్ట్రం విభజన జరగలేదన్నారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నందువల్ల బిల్లు పార్లమెంటుకు రాదన్న విశ్వాసం ఉందన్నారు. అసెంబ్లీ తిరస్కరించాక కొత్త రాష్ట్రం ఎక్కడా ఏర్పడలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. న్యాయపరమైన సమస్యల కారణంగా బిల్లు పార్లమెంట్‌కు రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి పార్లమెంట్‌కు పంపుతారనుకోవడం లేదన్నారు. రాష్టాల్రను కేంద్రం గౌరవించకపోతే కేంద్రాన్ని రాష్ట్రాలు ఎందుకు గౌరవించాలి. కేంద్రం తెలంగాణ ప్రతినిధిలా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుపై కిరణ్‌కుమార్‌రెడ్డి నేరుగా స్పందించని ముఖ్యమంత్రి కాలమే సమాధానం చెబుతుందన్నారు. విభజనను అడ్డుకోవడానికి కొత్త పార్టీ ఓ మార్గమనుకుంటున్నామని పేర్కొన్నారు. తాను ఈ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రినని, పదవి తాత్కాలికం. రాష్ట్రమూ, ప్రజలు శాశ్వతమన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే రాష్ట్రానికి, జాతికి ప్రయోజనమని, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్నివర్గాల మేలుకోసమే విశాలాంధ్ర ఏర్పడిందన్నారు. ఏ విధంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయో ఒకసారి చరిత్రలోకి వెళ్తే తెలుస్తుందన్నారు. ఉద్వేగ వాతావరణంలో నిర్ణయాలు తీసుకోరాదని అప్పటి ప్రధాని ఇందిర చెప్పారని ముఖ్యమంత్రి చెప్పారు. నిజాం పాలన కొంత బాగున్నా అందరికీ విద్యావకాశాలు లేవని ఇందిర చెప్పారన్నారు. పార్లమెంటులో ఇందిరాగాంధీ రాష్ట్రం గురించి మాట్లాడారని ముఖ్యమంత్రి చెప్పారు. ఎస్సార్సీ వల్లే పలు రాష్టాల్రు ఏర్పడ్డాయి. విశాలాంధ్ర కావాలని కోరుతున్నానని ఆనాడు బూర్గుల శాసనసభలోనే చెప్పారు. ఏకాభిప్రాయంతోనే కొత్త రాష్ట్రం ఏర్పాటు జరగాలని తొలి ఎస్సార్సీలో చెప్పారు. ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగ్గా ఉంటేనే రాష్ట్రం ఏర్పాటుచేయాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడేటప్పుడు వచ్చే అనేక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. తెలుగువారి భాష, సంస్కృతి ఒక్కటే కాబట్టి తొలి ఎస్సార్సీ వీరిని కలిపింది. 1956లో ఫజల్ అలీ కమిషన్ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటకకు కొన్ని జిల్లాలు వెళ్లాయి. కృష్ణా, గోదావరి నదులు ఒకరాష్ట్రంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. మనం 14 ఎఫ్ తీసేసినట్లే అప్పట్లో ముల్కీ నిబంధనలు తీసేశారు. బలవంతంగా తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలు కలవలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అప్పటి తెలంగాణ, ఆంధ్ర నేతలు కలిసుండాలనుకోవడం వల్లే రాష్ట్రం ఏర్పడింది. వెనకబాటుతనం ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవడం సరికాదని ఇందిర చెప్పారు. తెలంగాణ కంటే రాయలసీమ, శ్రీకాకుళం వెనకబడ్డాయని ఇందిర చెప్పారన్నారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి ఒకేలా ఉండదని ఇందిరాగాంధీ అప్పట్లోనే వూహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే సమస్యకు పరిష్కారం కాదని ఇందిర చెప్పారు. నేడు ఉత్పన్నమయ్యే సమస్యలను ఇందిరాగాంధీ ఆనాడే ఊహించారు. రాష్ట్ర విభజన చేస్తే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని ఇందిర తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారన్నారు. జగన్, చంద్రబాబు లాగా తాను విధానాలను మార్చుకోలేనని సిఎం అన్నారు. ఇప్పటికీ చంద్రబాబు తన విధానం ఏమిటీ స్పష్టం చేయడం లేదన్నారు. అభివృద్ధి జరగలేదని 60 ఏళ్ల తరవాత ఇప్పుడు ఎలా విడదీస్తారని అన్నారు.
కిరణ్ మళ్లీ కిరికిరి




