అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ
తృతీయ కూటమితో మరింత వెనక్కు
– గుజరాత్ సిఎం నరేంద్ర మోడీ
కోల్‌కతా, ఫిబ్రవరి 5 : ఒక్క అవకాశం ఇవ్వండి.. తామేంటో చూపిస్తా బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కోల్‌కతాలో బుధవారం బహిరంగ సభలో మాట్లాడారు. ముందుగా బెంగాలీలో ప్రజలకు అభివాదం తెలిపారు. ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉండాలన్నది స్వామి వివేకానందుడి కల అన్నారు. చాలా కాలం పాటు జౌళి పరిశ్రమలో రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన సేవలు ప్రజలు మరువలేనిదన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గుజరాత్‌లో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌తో గుజరాత్ రాష్ట్రానికి అవినావభావ సంబంధాలు ఉన్నాయని అన్నారు. మొదటి నుంచి దేశానికి బెంగాళ్ మార్గదర్శనం చేస్తూనే ఉందన్నారు. దేశం అగ్రస్థానంలో ఉండాలంటే గుజరాత్ పాత్ర కీలకమన్నారు. 60 ఏళ్ళ పాలనను ప్రజలు చాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులని చెప్పారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రలో తృణమూల్ ప్రభుత్వంలో ఏది మంచిదో మీకే తెలుస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ దేశానికి మార్గదర్శకం కావాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు అధికారంలోకి రాలేదు కాబట్టే ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నారు. బెంగాల్ అభివృద్ధి ఒక రాష్ట్రంతోనే కాదు కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉండాలని సూచించారు. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. తమకు సేవలకు ఇక్కడి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని, 60 ఏళ్ళల్లో జరగని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు. గత ఎన్నికల్లో మార్పు కోసం ఓటేస్తే మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో రాజకీయ నిపుణులకు అంచనాకు అందని ఫలితాలను చూపిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఇక్కడ 35 శాతం పాఠశాలలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు విద్య, వైద్య, తాగునీరు వసతులు కోరుకుంటున్నారు. మొదటిసారిగా ఇంతటి జనసంద్రాన్ని తాను చూస్తున్నానని పేర్కొన్నారు. మూడో కూటమి ఏర్పడితే దేశం మరింత వెనకబడిపోతుందన్నారు. గాలి ఎటు వీస్తుందో మూడోకూటమి గమనించాలన్నారు. ముందుగా రాష్ట్రంలో మార్పు తెస్తేనే కేంద్రంలో కూడా దానంతట అదే మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.




