Tuesday, 3 November 2026

బాబు (ఎడ్‌ది రేట్‌) కుట్ర మో’డీల్‌’


తెలంగాణ అడ్డుకుంటే సీమాంధ్రలో సీట్లు
భాజపాకు బాబు బంపర్‌ ఆఫర్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు రెండు కళ్ల బాబు తెరవెనుక కుట్రలను తీవ్రతరం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని, ఆ కారణంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ దేశ రాజధానిలో ఎక్కే గడప దిగే గడపగా బిజీ బిజీగా ఉంటోన్న చంద్రబాబు వారెవరూ తెలంగాణను ఆపలేరని త్వరగానే అర్థం చేసుకున్నాడు. తెలంగాణకు మొదటి నుంచి మద్దతు ఇస్తోన్న బీజేపీని మచ్చిక చేసుకుంటే తప్ప తన ప్రయత్నం నెరవేరదనే నిర్ణయానికి వచ్చాడు. తన సామాజిక వర్గానికే చెందిన ఆ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు సాయంతో ఆ పార్టీలోని ముఖ్యులందరితో భేటీ అవుతూ తెలంగాణను ఆపితే సీమాంధ్రలో అత్యధిక ఎంపీ స్థానాలు సాధించవచ్చని, తమ పార్టీ అక్కడ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తోంది కాబట్టి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మద్దతుగా నిలుస్తామని నమ్మబలుకుతున్నాడు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని తన వాదన ద్వారా ఆకట్టుకున్న చంద్రబాబు ఈమేరకు మోడీతో డీల్‌ కుదుర్చుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలో 17 లోక్‌సభ స్థానాలుండగా, సీమాంధ్రలో 25 ఎంపీ సీట్లున్నాయని, తెలంగాణను ఆపగలిగితే వాటిలో మెజార్టీ స్థానాలను ఎన్‌డీఏ గెలుచుకోవడం ఖాయమని చంద్రబాబు మోడీకి బూష్టింగ్‌ ఇచ్చాడు. అసలే దక్షిణ భారతదేశంలో అంతంత ఉన్న ఎన్‌డీఏ పరిస్థితి చంద్రబాబు రాకతో కొంత బలం పుంజుకుంటుందని ఆశిస్తున్నాడు. తెలంగాణ ఇస్తే ఆ క్రెడిట్‌ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకే వెళ్తుంది కాని బీజేపీకి లాభించే అవకాశం లేదని ఆ పార్టీ ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. సర్వేలు కూడా అదే తేలుస్తుండటంతో బీజేపీ, టీడీపీ ఇచ్చే ఆఫర్‌కే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే బీజేపీ నేతలు తెలంగాణపై అడ్డంగా మాట్లాడుతున్నారు. బుధవారం ఢిల్లీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్వ్యవ్థసీకరణ బిల్లులో లోపాలు, రాజ్యాంగ ఉల్లంఘనల గురించి జాతీయ నేతలకు వివరించానని చెప్పారు. బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని మరోమారు తెలిపారు. కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలను ఎండగట్టి వివిధ పార్టీల నేతలకు వివరించానన్నారు. ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి ఒప్పించాలని చెప్పినా కేంద్రం వినలేదన్నారు. తెలంగాణ ఇవ్వాలంటే సీమాంద్ర వాసులను ఒపపించాలని, సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణ వాసులను ఒప్పించాల్సి ఉందన్నారు. ఇవేవీ చేయకుండా కేవలం ఓట్లు, సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్‌ విభజన బిల్లుతో ముందుకు పోతోందని అన్నారు. రాజకీయ లబ్ది కోసం కేంద్రం పార్టీలతో లాలూచీ పడి నీచంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ఆర్టికల్‌ 356ను కాంగ్రెస్‌ పార్టీ 90 సార్లు దుర్వినియోగం చేసిందన్నారు. ఏ రాష్ట్రాన్ని విభజించాలన్నా, పేరు మార్చాలన్నా, ఎస్సార్సీ, కమిషన్‌ ద్వారానే జరిగాయని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్ర ప్రజలను ఒప్పించాలని, సమైక్యాంధ్ర కొనసాగించాలంటే తెలంగాణ ప్రజలను ఒప్పించాలని చంద్రబాబు అన్నారు. సోనియా తీసుకున్న నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడు వ్యతిరేకిస్తారని, కేంద్రమంత్రివర్గ నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకిస్తారని చంద్రబాబు విమర్శించారు. పదేళ్ల పాలనలో సమస్యను పరిష్కరించలేకపోయారని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆర్టికల్‌ 3ని ఉపయోగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గత పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రబుత్వమే అధికారంలో ఉన్నా ఎందుకు సమస్యను పరిష్కరించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఉమ్మడి రాజధాని ఎక్కడా లేదన్నారు. గవర్నర్‌ చేతిలో అధికారలు, నీటి వ్యవహారాలు కేంద్రం చేతిలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. సమస్య సృష్టించింది సోనియా, కాంగ్రెస్‌ అయితే రాష్ట్రపతి వద్ద డ్రామాలెందుకని ప్రశ్నించారు. తెలుగుజాతిని నిట్టనిలువుగా చీల్చిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. మూడు పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయన్నారు. రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులు బాగుంటే రాజ్యాంగం బాగుంటుందని అంబేద్కర్‌ చెప్పారని, రాజకీయ స్వలాభం, ఓట్లు, సీట్ల కోసం విద్వేషాలు సృష్టించడం సరికాదని చంద్రబాబు అన్నారు. తమకు కావలసింది వార్‌ రూమ్‌ కాదు, పీస్‌రూమ్‌ అని చంద్రబాబు అన్నారు. వీరి కుమ్మక్కు రాజ్యసభ ఎన్నికల్లోనే బయటపడిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *