న్యూఢిల్లీ: సమైక్య రాష్ట్రంలో మంత్రులకే గౌరవం లేదని మంత్రి గీతారెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు కంటతడిపెట్టారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ నేతలు రాష్ట్రపతిని కలిసిన సందర్భంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నిన్నటి ఏపీ భవన్ ఘటనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సమైక్య రాక్ష్మంలో తమకు గౌరవమే లేకుండా పోయిందని పేర్కోన్నారు. తెలంగాణకోసం ఇప్పటి వరకు వేలమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె వివరించారు. తెలంగాణ తల్లుల గర్భశోకాన్ని అర్థం చేసుకునే సీడబ్ల్యూసీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి అన్ని విధాల అన్యాయమే జరిగిందని పేర్కోన్నారు. సీమాంధ్ర వాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ బిల్లు తప్పుల తడకఅని సీఎం అంటున్నారని తప్పుల తడక అని ముందే తెలవదా? అని ఆమె అన్నారు. బిల్లు పత్రులను కాల్చి, చించి వేశారని ఆమె రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. మహిళా మంత్రులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నా సీఎం చూస్తూ బస్సులోనే కూర్చున్నారని ఆరోపించారు. కలిసిఉండడం అంటే పోలీసులతో కొట్టించడమేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. మా తెలంగాణ మాకివ్వండి, మమల్ని గౌరవంగా బతకనివ్వండి అని గీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.




