Wednesday, 4 November 2026

నేడు రాజ్యసభ పోలింగ్‌

మొదటిసారి తిరస్కార ఓటు
ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ, డీజీ
పోటీ నుంచి వైదొలిగిన ఆదాల
హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) :
రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం శాసనభ ఆవరణలోని కమిటీ హాలులో ఓటింగ్‌ జరుగనుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ నేపథ్యంలో ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ, సీమాంధ్రలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రలు ఒక్కొక్కరే హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి రాజా సదారాం తెలిపారు. ఆయనతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్‌లాల్‌ భేటీ అయ్యారు. డీజీపీ ప్రసాదరావుతో కలిసి ఆయన ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యేలు సుమన్‌రాథోడ్‌, జనార్ధన్‌ థాట్రాజ్‌, చెన్నమనేని రమేశ్‌కు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు లేదని బన్వర్‌లాల్‌ తెలిపారు. 176 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉన్నట్లు ఆయన తెలిపారు. తొలిసారిగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో అభ్యర్థుల పేర్లతో పాటు తిరస్కరణ ఓటు ఉంటుందని ఆయన చెప్పారు. రాజ్యసభ ఎన్నికలను పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణతో పాటు చుట్టుపక్కలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీలోకి సభ్యలను తప్ప మరెవరినీ అనుమతించరు. ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దింపిన కాంగ్రెస్‌కు శాసనసభలో 146 మంది ఎమ్మెల్యేల బలమున్నా వీరిలో ఆరుగురు ఇటీవల వైకాపాలో చేరారు. జనార్దన్‌ థాట్రాజ్‌కి ఓటుహక్కు లేదు. ఇక కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న స్వతంత్ర సభ్యుడు కూన శ్రీశైలంగౌడ్‌ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. మొత్తంగా 140 ఓట్లున్న కాంగ్రెస్‌ ఓట్ల విభజనకు సంబంధించి మల్లగుల్లాలు పడుతోంది. వైకాపా ఓటింగ్‌లో పాల్గొనకపోతే.. ఒక్కో అభ్యర్థికి సుమారు 37 ఓట్లు అవసరమవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు 51 ఓట్లున్నాయి. అంటే 14 ఓట్లు మిగులుతాయి. వీరంతా కేశవరావుకి ఓట్లేస్తారనుకుంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో సీమాంధ్ర ఓట్లతోనే మిగిలిన ఇద్దరు అభ్యర్థులు కె.వి.పి.రామచంద్రరావు, సుబ్బరామిరెడ్డిలు సులువుగా గెలుపొందుతారు. మరోవైపు తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆదాల సీఎం జోక్యంతో రంగంలో నుంచి తప్పుకున్నాడు. సీఎం వ్యవహారశైలిపై తెలంగాణ మంత్రుల ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సమైక్యవాదులకు తాము ఓట్లేయబోమని తెలంగాణకి చెందిన కొందరు మంత్రులు నేరుగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌కు తెగేసి చెప్పారు. తమ ప్రాంతానికి చెందిన పార్టీ అభ్యర్థి ఎం.ఎ.ఖాన్‌కి వేయగా మిగిలిన ఓట్లను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.కేశవరావుకి వేస్తామన్నారు. వైసిపిని నమ్ముకుని పోటీలో ఉండడం మంచిది కాదని భావించి పోటీ నుండి తప్పుకున్నట్లు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. తనకు 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరినీ దూషించడం లేదని.. వైసిపి సహకరించడం లేదు..పోటీ నుంచి విరమించుకోవద్దని వైసిపి చెప్పింది.. దీనిని ఎలా అర్థం చేసుకుంటారో విూ ఇష్టం అంటూ ఆదాల విూడియాకు చెప్పారు.రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత కాంగ్రెస్‌ అధిష్టానం టి.సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రారావు, ఎం.ఎ.ఖాన్‌ లకు టికెట్లు ఖరారు చేసింది. టికెట్లు ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ చైతన్య రాజు, ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌ రెడ్డి రెబెల్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ లు వేశారు. వీరిని బరి నుండి తప్పించేందుకు సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ఇతర నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో చైతన్యరాజు బరి నుంచి తప్పుకున్నారు. కాని ఆదాల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ ను ఉపసంహరించుకోలేదు. ఆదాల బరి నుంచి తప్పుకున్నారని ఎమ్మెల్యే వెంకట్రారామయ్య నామినేషన్‌ ఉపసంహరణ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆదాల అగ్గిలం విూద గుగ్గిలమయ్యారు. తాను నామినేషన్‌ ఉపసంహరించుకోలేదని రిటర్నింగ్‌ అధికారికి చెప్పారు. దీనితో ఆయన్ను ఎలాగైనా బరి నుండి తప్పించాలని సీఎం ప్రయత్నించారు. అందులో భాగంగా గురువారం ఆదాల ప్రభాకర్‌ రెడ్డితో సిఎం మంతనాలు జరిపారు. చివరకు బరి నుంచి తప్పుకునేందుకు ఆదాల ఒప్పుకున్నారు. దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 6 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జగన్‌ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో పాటు ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది. మరోవైపు అధిష్టానం కూడా ముఖ్యమంత్రి ద్వారా బరిలో నుంచి తప్పించేందుకు చర్యలు చేపట్టింది. మొన్న చైతన్య రాజు, ఇప్పుడు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పోటీ నుండి తప్పుకోవడంతో కాంగ్రెసు పార్టీ నుండి కెవిపి రామచంద్ర రావు, టి సుబ్బిరామి రెడ్డి, ఎంఏ ఖాన్‌, తెలుగుదేశం పార్టీ నుంచి గరికపాటి, సీతారామలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కె కేశవరావు ఎన్నిక కానున్నారు. అయినా పోలింగ్‌ తప్పకపోవడంతో శుక్రవారం ఓటింగ్‌ జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *