
రాజ్యసభ ఓటింగ్ ముగియగానే రాజీనామా కోరే అవకాశం
ఇంకా ఉపేక్షించరాదని నిశ్చయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) :
అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీకి తలవంపులు తెచ్చిపెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సాగనంపడానికి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కిరణ్ మార్పుపై ఎప్పట్నుంచో ఊహాగానాలు సాగుతోన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో పాటు వివిధ సమస్యల నేపథ్యంలో ఆయన్నే కొనసాగిస్తూ వచ్చింది. తెలంగాణ బిల్లుపై శరవేంగంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ అధిష్టానం అదే వేగంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పును కూడా అంతే తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తున్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని తప్పించే ప్రయత్నాల్లో సోనియా ఉన్నట్లు సమాచారం. బిల్లును వ్యతిరేకిస్తూ కిరణ్ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేయడంపై సోనియా సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించండంతో పాటు గతకొంత కాలంగా ఆయన వ్వయహర శైలి ధిక్కరించేదిగా ఉంది. తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ విమర్శలు కూడా కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేశాయని అంటున్నారు. ఈ దశలో బీజేపీ తీరుతో కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచనలో పడిందని సమాచారం. ముందు సొంత ఇంటిని సక్కదిద్దుకోండి.. పార్లమెంటు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేసుకోండి.. అని బీజేపీ కాంగ్రెస్‌పై ఎదురు దాడి ప్రారంభించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ దిశకగా చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఢిల్లీలో దీక్ష చేసినా ఆపార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బిజెపి నేత జవదేకర్ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డబుల్‌గేమ్ ప్రజలకు తెలియాలనేదే తమ ఉద్దేశ్యమని జవదేకర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ముందుగా సీఎం కిరణ్‌ను తప్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఎం తీరు పార్టీ విధానాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ఉందని, కిరణ్‌ను వెంటనే తప్పించాలనే ఒత్తిడి పెరిగినందున కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మరోవైపు సీఎం మార్పు ఊహాగానాలేనని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. కానీ అధిష్టానం పెద్దలు మాత్రం సోనియా ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారని చెప్తున్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపించి అభిప్రాయాలు మాత్రమే చెప్పమంటే తీర్మానం చేయించి పంపడం, శ్రీధర్‌బాబు శాఖ మార్చడాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో ఏడో అభ్యర్థి ఆదాలను కూడా సీఎం రంగంలో దింపారన్న ప్రచారం కూడా సాగింది. ఇది కూడా కాంగ్రెస్ అధిష్టానానికి కోపం తెప్పించిందని తెలుస్తోంది. అందుకే సీఎం కిరణ్ ముందుగా తన సీటును పదిలం చేసుకునే చర్యలో భాగంగా ఆదాలను తప్పించారని ప్రచారం సాగింది. అయినా కూడా అధిష్టానం సీఎం కిరణ్‌ను రాజీనామా చేయమని అడిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాజ్యసభ పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రితో రాజీనామా చేయిస్తారని సమాచారం. ఈ నెల 10నుంచి ఓటాన్ అకౌంట్ సమావేశాలకు వెళ్తున్న దశలో అంతకు ముందే అంటే సీఎం రాజీనామా కోరవచ్చని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు శుక్రవారం ముగిస్తే ఇక అసెంబ్లీతో పని ఉండకపోవచ్చు. ఇదిలావుంటే కిరణ్‌ను మారిస్తే ఆయన స్థానంలో మరో సీమాంధ్ర వ్యక్తినే సీఎంగా చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. వ్వయసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
సీఎంను సాగనంపేందుకు అధిష్టానం నిర్ణయం




