బీసీ ముసుగులో సంఘ్ పరివార్ కొత్త కుట్రలు
మోడీ ప్రధాని అయితే బీసీ రిజర్వేషన్లు మాయం
సెక్యులరిజం పరిరక్షణతోనే దళిత, బహుజనుల మనుగడ
ప్రొఫెసర్ కంచ ఐలయ్య
అబిడ్స్, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో దేశానికే ప్రమాదమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బహుజన్ సెక్యులర్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం అబిడ్స్‌లోని సారస్వత పరిషత్‌లో నిర్వహించిన ‘సెక్యులరిజానికి జీవం పోద్దాం! భిన్నత్వాన్ని కాపాడుకుందాం! మోడీని ఓడిద్దాం-దేశాన్ని రక్షిద్దాం’ మహా చర్చను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీసీ, చాయ్‌వాలా ముసుగులో సంఘ్ పరివార్, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు దేశాధికారాన్ని కోరుకుంటున్నారని, ఆ శక్తుల కుట్రలు ఫలిస్తే దళిత, బహుజనుల మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు. పుట్టుకరీత్యా నరేంద్రమోడీ బీసీ కావొచ్చేమో కాని ఆయన ఆచరణ రీత్యా బీసీ ఎన్నటికీ కాబోడని స్పష్టం చేశారు. దళిత, బహుజన ఆలోచనా విధానమే లేని మోడీ, కార్పొరేట్ శక్తులకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న మోడీ బీసీ ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. మోడీ సంఘ్ పరివార్, ఆర్‌ఎస్‌ఎస్ అతివాద ప్రతినిధి అని ఆయన పేర్కొన్నారు. 2002 గుజరాత్‌లో ఊచకోతల గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వ అతివాదశక్తులు తమ ఆలోచనా విధానాన్ని అమలు చేసేందుకు మోడీని ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకువస్తున్నాయని ఆయన చెప్పారు. దానికి మీడియా విస్తృత ప్రచారం కల్పిస్తోందని, మోడీ తప్ప అనే అనివార్యతను కల్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రధాని అయితే దేశానికి మతతత్వంతో పాటు బహుళజాతి కంపెనీల వల్ల పెను ముప్పు వాటిల్లుందని అన్నారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి ఇందుకు తార్కాణమన్నారు. బీసీగా చెప్పుకునే మోడీ బీసీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకి అని ఆయన తేల్చిచెప్పారు. గతంలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో మోడీ భాగస్వామి అని చెప్పారు. దేశ జనాభాలో అత్యధికులైన బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా వాళ్లను కాళ్లకింద తొక్కిపెట్టి ఓటు వేసే యంత్రాల్లా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. సెక్యులరిజం పరిరక్షణతోనే దళిత, బహుజనుల మనుగడ సాధ్యమని ఆయన అన్నారు. జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని విస్తృతం చేయడం ద్వారా, ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా దేశాన్ని మతతత్వ శక్తుల నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి చర్చ తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. నాలుగు సెషన్లుగా సాగిన ఈ మహాచర్చలో గాదె వెంకటేశ్, సంగిశెట్టి శ్రీనివాస్, జమీలా నిషాత్, కె. లలిత, డాక్టర్ పసునూరి రవీందర్, రవి, డానియేల్, స్కైబాబా, పౌర హక్కుల సంఘం నేత ఇ. రఘునాథ్, సతీశ్, కె. రమేశ్, జనంసాక్షి ఎడిటర్ ఎం.ఎం. రహమాన్, జ్యోతి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.





