
వెంకయ్య సన్నాయి నొక్కులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన బిల్లుతో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగే అవకాముందంటూ బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు సన్నాయి నొక్కులు నొక్కారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే ముందు బిజెపి దాన్ని సమగ్రంగా అధ్యయనం చేస్తుందని పార్టీ నాయకుడు వెంకయ్యనాయుడు తెలిపారు. ఆదివారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో బిల్లుపై కొంత స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తమ పార్టీ కట్టుబడి ఉందని వెంకయ్య పునరుద్ఘాటించారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కారించాల్సిన అవసరాన్ని నాయకుడు నొక్కిచెప్పారు. ఇరు ప్రాంతాల అభివృద్ధి కోసం మేం కొన్ని నిర్మాణాత్మకమైన సూచనలు చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకున్నట్లుగా కనిపించడంలేదు అని నాయుడు పేర్కోన్నారు. జీవోఎం సభ్యుడు కేంద్ర మంత్రి జైరామ్ రమేష్‌తో సమావేశమైన సందర్భంగా తాను సూచనలు చేసినట్లు బిజెపి నాయకుడు వెల్లడించారు. తెలంగాణ బిల్లుపై మద్దతు కోరుతూ తనను కలిసిన దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ లాంటి కొందరు కాంగ్రెస్ నాయకులకు కూడా తాను కొన్ని సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ప్రతిపాదిత కొత్త రాష్ట్రాల బడ్జెట్ మధ్య అంతరాలను తొలగించే అంశాలను బిల్లులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కోస్తాంధ్ర ప్రస్తుతం రూ||684కోట్ల మిగులు బడ్జెట్‌ను కలిగి ఉండగా, రాయలసీమకు రూ||7,600 కోట్ల లోటు బడ్జెట్ ఉందని వెంకయ్య వేలెత్తి చూపారు. హైదరాబాద్ లేని తెలంగాణ రూ||8400 కోట్లు లోటు బడ్జెట్‌ను కలిగి ఉండగా ఒక్క హైదరాబాద్ రూ 12,854కోట్ల మిగులు బడ్జెట్‌ను కలిగి ఉంది.
ఈ బిల్లుతో సీమాంధ్రకు అన్యాయం




