Wednesday, 4 November 2026

మాది థర్డ్‌ కాదు ఫస్ట్‌ ఫ్రంటే

బీహార్‌ సీఎం నితీశ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) :
తమది థర్డ్‌ ఫ్రంట్‌ కాదు ఫస్ట్‌ ఫ్రంటేనని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తేల్చిచెప్పారు. ఈ నెలాఖరు వరకు తమ ఫ్రంట్‌ కు రూపురేఖలు ఏర్పడనున్నాయని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ఇక ఉమ్మడిగా పోటీచేసి ప్రత్యమ్నాయం చూపాలని వివిద పార్టీలు నిర్ణయించాయి. మాజీ ప్రధాని దేవేగౌడ నివాసంలో సీపీఐ(ఎం), సీపీఐ, జేడీయూ నేతలు సమావేశమయ్యారు. ప్రకాశ్‌ కరత్‌, ఏబీ బర్దన్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరత్‌ మీడియాతో మాట్లాడారు. నితీష్‌ ఢిల్లీకి రావడం వల్ల ఈ సమావేశం ఏర్పాటు చేశారని, కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలతో థర్డ్‌ ఫ్రంట్‌ ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఆలోచించడం జరిగిందని, అలాగే థర్డ్‌ ఫ్రంట్‌ ఎలా ఉండాలనే దానిపై చర్చించడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌, బిజెపి రాజకీయ, ఆర్థిక విధానాలలో ఎలాంటి తేడా లేదని ప్రకాశ్‌ కారత్‌ పేర్కొన్నారు. థర్డ్‌ ఫ్రెంట్‌ ను మోడీ థర్డ్‌ గ్రేడ్‌ గా పేర్కొన్నారని, దానిని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. థర్డ్‌ గ్రేడ్‌ అనేది అన్నింటికన్నా పైనే ఉంటుందని.. మోడీ ఇంకా ఫస్ట్‌ గ్రేడ్‌ లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో నరేంద్ర మోడీ విధానాల వల్ల కార్పొరేట్‌ సంస్థలు ప్రజలను దోచుకుంటున్నాయని తెలిపారు. కాంగ్రెసేతర, బీజీపీయేతర పార్టీల నేతలు మాములుగా కలిశారని, ఇది అధికారిక భేటీ- కాదని నితీష్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తరువాత 11 పార్టీలు సమావేశమై మూడో ఫ్రంట్‌ చర్చిస్తాయని దేవౌగడ పేర్కొన్నారు. ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా అత్యంత కీలకమైన సమావేశం జరగనుందనే భావిస్తున్నారు. ఢిల్లీలో సోమవారం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉదయం 11గంటలకు ఈ సమావేశం జరిగిన సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. ప్రజా వ్యతిరేక విధానాలు..నిరంతరం కుంభకోణాలు అవినీతి మరకలతో యూపీఏ పాలన అత్యంత అవినీతిమయంగా మారిన సంగతి తెలిసిందే. స్వయంగా మంత్రులే ఎన్నో ఆరోపణలలో ఇరుక్కున్నారు. చివరకు వీరు జైలుకు కూడా వెళ్లిన సందర్భాలున్నాయి. దీనితో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. మరోపక్క బిజెపి నరేంద్ర మోడీ జపం చేసుకుంటూ వెళుతోంది. దేశానికి నమో తప్ప గత్యంతరం లేదని ప్రచారం చేస్తోంది. అధికార పీఠం చేజిక్కించుకోవాలని కాషాయదళం ఉవ్విళ్లూరుతోంది. కార్పొరేట్‌ శక్తులకు మిత్రుడిగా ఉంటూ అధికారం దక్కించుకోవాలని ఆరాటంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌, బిజెపి దొందు దొందే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండిటి ఆర్ధిక విధానాలకు పెద్దగా బేధం లేదని విమర్శిస్తున్నారు. 2014 ఎన్నికలు దగ్గరకొస్తున్న సందర్భంలో రాజకీయ పార్టీలు తమతమ వ్యూహాలు రచించుకుంటున్నాయి. గెలుపే ధ్యేయంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే యోచనలో ఉన్నాయి. సిపిఎం, సిపిఐ, ఎఐడిఎంకె, బిజు జనతాదళ్‌, జనతాదళ్‌, జనతా దళ్‌, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా, అసోం గణ పరిషత్‌, సమాజ్‌ వాదీ పార్టీ, రెవొల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా, ఫార్వర్డ్‌ బ్లాక్‌ మొదలైన పార్టీలన్నీ కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా పనిచేయనున్నాయి. 2014 ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ సమన్వయంతో పనిచేయాలని భావిస్తున్నాయి. ఇవే అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *