Wednesday, 4 November 2026

నేడు రైల్వే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌

బాదుడు లేని బడ్జెట్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :

లోక్‌సభలో బుధవారం రైల్వే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందస్తుగా కాంగ్రెస్‌ ఆరుగురు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక విభజన బిల్లు ముందుగా లోక్‌సబకు వస్తుందని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. మంగళవారం లోక్‌ సభ బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రైల్వే బడ్జెట్‌, ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ పై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణ బిల్లు సమావేశంలో చర్చకు రాలేదని తెలుస్తోంది. సాయంత్రం జరిగే కాంగ్రెస్‌ అత్యవసర కోర్‌ కమిటీ భేటీ టి.బిల్లుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత ఐదురోజులుగా  లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోసారి యుపిఏ ప్రభుత్వంపై టిడిపి ఎంపీలు కొనకళ్ల, మోదుగుల అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్‌ నుంచి లగడపాటి, సబ్బంహరి నోటీసులిచ్చారు. రాజ్యసభ నుంచి బిల్లు వెనక్కి వెళ్లిన నేపథ్యంలో తెలంగాణ ఎంపీల వ్యూహం ఆసక్తి రేపుతోంది. అటు సభ బయట కూడా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇంకోవైపు ఎలాగైనా బిల్లు పార్లమెంట్‌కు వచ్చేలా చేయాలని తెలంగాణ నేతలు చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును రానీయబోమని సీమాంధ్ర నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయం మొత్తం ఢిల్లీలోనే మకాం వేసింది. రేపు లోక్‌సభలో రైల్వే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఉంది. దీంతో తెలంగాణ బిల్లు లోక్‌సభకు ఎప్పుడొస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ లోక్‌సభకు తెలంగాణ బిల్లు వస్తే ఆమోదించడం కాంగ్రెస్‌కు కత్తి విూద సాముగానే ఉంటుంది. సీమాంధ్ర ఎంపీలు ఇప్పటికే నానా గొడవ చేస్తున్నారు. ప్రాణత్యాగాలకైనా సిద్ధమని సబ్బం హరి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతూ కూడగట్టడం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. బీజేపీ సైతం సవరణలు కోరుతోంది. మరోవైపు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సీమాంధ్ర కేంద్ర మంత్రులందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోర్‌ కోఆర్డినేషన్‌ చేసే పనిలో కాంగ్రెస్‌ అధినాయకత్వం రంగంలోకి దిగినా ఫలితం కనపడటం లేదు. ఒక వేళ సభ్యులను సస్పెండ్‌ చేస్తే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీంతో టి.బిల్లు ఆమోదింప చేయడం అధిష్టానానికి కత్తిమీద సాములా తయారయింది.ఈ నేపథ్యంలో గురువారం బిల్లు ప్రవేశ పెడితే ఎలా నెట్టుకొస్తుందని ప్రశ్న ఉదయిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *