
నీ సంగతేందంటూ జేపీ గల్లా పట్టిన తెలంగాణవాదులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :
తెలంగాణపై పూటకో మాట.. గడియకో వేషంతో గందరగోళం సృష్టిస్తున్న జేపీని తెలంగాణవాదులు ఢిల్లీలో అడ్డుకున్నారు. అసలు నీ సంగతేంటో తేల్చాలంటూ గల్లా పట్టి నిలదీశారు. లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మీడియా సమావేశాన్ని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తెలంగాణపై వైఖరి సూటిగా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థి జేఎసి సభ్యులు జేపీ ప్రసంగాన్ని అడ్డుకుంటూ జై తెలంగాణ నినాదాలు చేశారు. ఆయన విూడియా సమావేశాన్ని పూర్తి చేయకుండానే నినాదాలు చేశారు. పోలీసులు ఆయనకు అడ్డుగా నిలిచి ఉండగా జేపీ చొక్కాపట్టుకుని లాగేందుకు యత్నించారు. తెలంగాణవాదుల ఆందోళన మధ్య జేపీని పోలీసులు లోపలికి తీసుకెళ్లారు. ఏపీ భవన్లో ఉదయం నుంచి లాయర్లు,విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అంతకుముందు ఎంపీ నామాను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. సమైక్యద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలంగాణ వాదులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదిలావుంటే ఏపీ భవన్‌లో లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణపై జరిగిన దాడికి చింతిస్తున్నామని తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. ఏపీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన కొంతమంది కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమమని, ఎవరు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని ఆయన చెప్పారు. కీలక సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నానన్నారు. కొందరు కావాలనే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారని వాటికి చలించవద్దన్నారు. కీలకతరుణంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదిలావుంటే అంతకు ముందు జెపి మాట్లాడుతూ ప్రస్తుత సమస్య తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య సమస్య కాదని, విభజన జరిగాక అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందాలని అన్నారు. విభజన అనంతర సమస్యలకు కేంద్రమే పరిష్కారాన్ని చూపించాలని జయప్రకాశ్ నారాయణ అన్నారు. తాము చూపించిన రోడ్‌మ్యాప్‌లో రెండు ప్రతిపాదనలే పరిగణనలోకి తీసుకున్నారన్నారు.పార్టీలు తమ ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాయన్నారు. ఈ విషయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలను ప్రత్యేక ప్రాంతాలుగా గుర్తించి, నిధులు కేటాయించాలని చెప్పామని అన్నారు. బిల్లుకు సంబంధించి అన్ని పార్టీలకు, నేతలకు 5 అంశాలతో కూడిన లేఖలు రాశామని, తాము సూచించిన అంశాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరుతున్నామని జేపీ అన్నారు. విభజన బిల్లుపై పలువురు కేంద్రమంత్రులను కలిసి వివరిస్తామన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, రాష్ట్ర విభజన జరిగాక హైదరాబాద్‌లోనే మిగులు ఆదాయం ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన జరిగాక అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందాలన్నదే తన వాదనని అన్నారు. జేపీ ప్రసంగం కొనసాగుతుండగానే తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థులు ఆయనపై దాడి చేశారు. ప్రసంగాన్ని అడ్డుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. ఆయన చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జేపీని లోపలికి తీసుకెళ్లిపోయారు.
పూటకో మాట.. గడియకో వేషం




