
మొయిలీ, ముఖేశ్‌పై క్రిమినల్ కేసు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
పెట్రో ఉత్పత్తుల కృత్రిమ కొరత, ధరల నిర్దారణలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీలపై ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద వీరిద్దరితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ముఖేశ్ అంబానీ, వీరప్ప మొయిలీ, పెట్రోలియం శాఖ మాజీ మంత్రి మురళీ దేవరా, హైడ్రోకార్బన్స్ మాజీ డైరెక్టర్ జనరల్ వీకే సిబల్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏసీబీని ఆదేశించిన విషయం తెలిసింది. సీఎం ఆదేశాలు అందిన మరుసటి రోజే ఏసీబీ అధికారులు స్పందించారు. కాగా తనపై కేసు నమోదు, ఆరోపణలు చేయడాన్ని వీరప్ప మొయిలీ ఖండించారు. ఇది కేజ్రీవాల్ అజ్ఞానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా నడుస్తుందో ఆయనకు తెలియదు. ధరల నిర్ధారణలో ఒక విధానం ఉంటుందంటూ మొయిలీ పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. కేజ్రీవాల్ నిర్ణయం తమను దిగ్భ్రాంతికి గురి చేస్తోందని, ఢిల్లీ ప్రభుత్వం నిరాధారణమైన ఆరోపణలు చేసిందని పేర్కొంది. ఏవిధమైన దర్యాప్తుకైనా తాము వ్యతిరేకం కాదని, అది రాజ్యాంగానికి లోబడే జరగాలి తప్ప రాజకీయ కక్షసాధింపుగా ఉండొద్దని కాంగ్రెస్ అధికారప్రతినిధి పేర్కొన్నారు. మొయిలీ రాజీనామా చేయబోరని కాంగ్రెస్ పార్టీ ఇది వరకే స్పష్టం చేసింది.
ఏసీబీ ఎఫ్‌ఐఆర్




