Wednesday, 4 November 2026

సంబరాలకు సిద్ధం


తెలంగాణ ఖాయం
పార్టీల రంగు బయటపడింది : కోదండరామ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, ఇక సంబరాలకు సిద్ధం కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టడానికి సిద్ధం కావడం నాలుగున్నర దశాబ్దాల ప్రజల పోరాటం, అమరవీరుల బలిదానాలతోనే సాధ్యమయ్యిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ముందుకు వస్తోన్న వేళ రాజకీయ పార్టీల అసలు రంగు బయటపడిందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణను అడ్డుకునేందుకు తుది ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సమన్యాయం నుంచి సమైక్యం వైపునకు అడుగులు వేసినా తెలంగాణకు చెందిన ఆ పార్టీ నాయకులు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ద్రోహులకు బుద్ధి చెప్పితీరుతారని అన్నారు. బుధవారం పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై కోదండరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు పార్లమెంట్‌లో ఆందోళనకు దిగడమేమిటని ఆయన ప్రశ్నించారు. మంత్రి పదవులకు రాజీమానా చేసిన తర్వాత ఎలాంటి ఆందోళనలు చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదని, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. టీడీపీ ఎంపీలు చట్టసభల పరువు తీసేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ బిల్లు పెట్టే వేళ వారు మరింత దిగజారవచ్చని ఆయన అన్నారు. పార్లమెంట్‌ మూజువాణి ఓటుతోనైనా తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *