18 మంది సస్పెన్షన్
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో గురువారం ప్రకంపనలు సృష్టించింది. ఎపీలో రెండు ప్రాంతాలుగా నిట్టనిలువుగా చీలిపోయిన ఎంపీల మధ్య బాహాబాహీకి కూడా దారితీసింది. అరుపులు, కేకల మధ్య ¬ం మంత్రి షిండే టి.బిల్లును ప్రవేశపెట్టేశారు. దీంతో సభలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. పలువురు తోపులాటకు దిగటంతో గందరగోళం తలెత్తింది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మిరియాల పొడి స్ప్రే చల్లడంతో తుమ్ములు, దగ్గులతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సంఘటనలకు కారకులైన 18 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ తర్వాత ప్రకటించారు.
టి. బిల్లును అసలు అజెండాలో కాకుండా అనుబంధ ఎజెండాలో చేర్చడం, దానిపై ప్రధాన ప్రతిపక్షమైన తమకు కూడా సమాచారం లేకపోవడంపై భాజపా మండిపడుతోంది.
నిమిషంలోనే… అంతా అయోమయం :
12 గంటలకు లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే కేంద్ర ¬ంమంత్రి షిండే ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా సభలో సీమాంధ్ర సభ్యులు పెద్ద పెట్టున ఉద్యమించారు. బల్లల పైకి ఎక్కి మైకులు, దస్త్రాలు చెల్లాచెదురు చేశారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ బల్లపై వస్తువులను మోదుగుల చిందరవందర చేశారు. ఎంపీలు రమేశ్ రాథోడ్, నామా నాగేశ్వరరావులతో పాటు పలువురు ఇతర రాష్ట్రాల ఎంపీలు మోదుగులను అడ్డుకున్నారు. ఏం జరుగుతోందో అర్ధమయ్యేలోపే అంతా ముగిసింది.
మిరియాలపొడి స్ప్రే చేసిన లగడపాటి :
లోక్‌సభలో ఎంపీ లగడపాటి మిరియాల పొడి స్ప్రే చేశారు. దాని ఘాటుకు ఎంపీలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కసారిగా కళ్లనుంచి నీళ్లు, దగ్గు రావడంతో ఏం జరిగిందో తెలియక అంతా అయోమయానికి గురయ్యారు. లగడపాటిని తెలంగాణ సభ్యులు, ఇతర ఎంపీలు పక్కకి లాగి నెట్టివేశారు. మిరియాలపొడి ఘాటుకు లగడపాటి అపస్మారక స్థితికి వెళ్లారు.
పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత :
అదే సమయంలో పార్లమెంట్ బయట కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులను మోహరించారు. పార్లమెంట్ ప్రవేశద్వారం వద్దకు వచ్చిన తె.దే.పా. ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు బలవంతంగా పంపించి వేశారు. మాజీ ఎంపీలు, ప్రజా ప్రతినిధులను కూడా పోలీసులు తరిమికొట్టడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఎంపీలు, మీడియా ప్రతినిధులు మినహా మిగిలినవారిని పార్లమెంట్ ఆవరణలోకి అనుమతించలేదు. రాష్ట్ర విభజన బిల్లును ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతున్నారనన సమాచారం తెలుసుకున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆందోళనకారులు పెద్ద ఎత్తున పార్లమెంట్ వద్దకు తరలివచ్చారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
లగడపాటి, పొన్నంలకు అస్వస్థత :
లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మిరాయాలపొడి స్ప్రే చేయడంతో ఒక్కసారిగా సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన ఎంపీలు లగడపాటి రాజగోపాల్, పొన్నం ప్రభాకర్‌లను పార్లమెంట్ ఆవరణలోని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తర్వాత ప్రకటించారు. లోక్‌సభ ఇన్నర్ లాబీల్లో ఇరుప్రాంత సభ్యుల మధ్య బాహాబాహీ జరిగినట్లు సమాచారం.
ఆత్మహత్యకు యత్నించిన మోదుగుల :
ఆది నుంచి విభజన బిల్లును వ్యతిరేకిస్తున్న సీమాంద్ర తెదేపా ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఈ రోజు లోక్‌సభలో ఆత్మహత్యకు యత్నించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ వద్ద టేబుల్ అద్దాలు పగులగొట్టి పొడుచుకునేందుకు యత్నించారు. మోదుగలు, లగడపాటిపై తెలంగాణ ఎంపీలు పిడిగుద్దులు గుద్దారని సీమాంధ్ర ఎంపీలు ఆరోపిస్తున్నారు.
బిల్లును సభలో ప్రవేశపెట్టాం : కమల్‌నాథ్
లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి కమల్ నాథ్ ప్రకటించారు. సభలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, ప్రజాస్వామ్యానికి కళంకమని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ మనోభావాలు చెప్పే అవకాశం ఉంటుందని, అలా చేయకుండా హింసకు దిగడం దారుణమన్నారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల నేతలు కోరారని కమల్‌నాథ్ అన్నారు. సభ్యులను తనిఖీ చేయడం నిబంధనలకు విరుద్ధమని, దాంతో సభ్యులు వివిధ వస్తువులతో సభలోకి ప్రవేశించినట్లు తెలుస్తోందన్నారు.
లోక్‌సభను ఖాళీ చేయించిన సిబ్బంది :
లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడటంతో సిబ్బంది లోక్‌సభను ఖాళీ చేయించారు. ఘర్షణ సందర్భంగా చెల్లాచెదరైన ఫర్నీచర్‌నుసరిచేస్తున్నారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ టేబుల్‌పై ఉన్న కంప్యూటర్ దెబ్బతిన్నట్లు సిబ్బంది గుర్తించారు.
కమల్‌నాథ్ ముందస్తు ప్రణాళికతోనే…
లోక్‌సభ సీమాంధ్ర ఎంపీలను అడ్డుకునేందుకు మంత్రి కమల్‌నాథ్ ముందస్తు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ఎంపలను అడ్డుకోవాలని ఎస్పీ, బిఎస్పీ, ఆర్జేడీ, కాంగ్రెస్, రాష్ట్రేతర ఎంపీలకు కమల్‌నాథ్ సూచించినట్లు సమాచారం. దాంతో వారు లగడపటి, మోదుగులను చుట్టుముట్టి దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల ఎంపీలతో మోదుగుల, లగడపాటి పెనుగులాడారు. కమల్‌నాథ్ పథకం ప్రకారమే ¬ం మంత్రి షిండేకి, స్పీకర్‌కి రక్షణగా పలువురు ఎంపీలను నిలిపి బిల్లును సభలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
ఇది హేయమైన ఘటన : స్పీకర్ మీరాకుమార్
లోక్‌సభలో జరిగినది హేయమైన ఘటన అని, తమనెంతో సిగ్గుపడేలా చేసిందని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ప్రజాస్వామ్యాన్ని ఎంతో గౌరవిస్తారని, అలాంటిది నేడు చోటుచేసుకున్న సంఘటనలు తమను సిగ్గుపడేలా చేశాయన్నారు.
లోకసభ నుంచి 18 మంది సభ్యుల సస్పెన్షన్
లోకసభలో గందరగోళానికి కారణమైన పలువురు సభ్యులను సస్పెండ్ చేస్టున్నట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. సమావేశాలు ముగిసేవరకు సభ్యులను సెక్షన్ 374 (ఎ) ప్రకారం సస్పెండ్ చేసినట్లు స్పీకర్ పేర్కొన్నారు.
సస్పెండైన సభ్యుల పేర్లు :
సీమాంధ్ర సభ్యులు :
కనుమూరి బాపిరాజు, ఎస్పీవై రెడ్డి, మాగుంట, ఉండవల్లి, సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి
కాంగ్రెస్ : కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, మోదుగుల వేనుగోపాల్‌రెడ్డి (తెదేపా), జగన్, మేకపాలి (వైకాపా)
తెలంగాణ సభ్యులు :
గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సురేష్ శెట్కార్ (కాంగ్రెస్)





