Wednesday, 4 November 2026

దక్షిణాదిలోనూ మోడీ హవా

బీజేపీ నేత వెంకయ్యనాయుడు ధీమా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: వచ్చే ఎన్నికల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర భారత దేశంలోనే కాకుండా ఈ సారి దక్షిణాదిలో కూడా మోడీ హవా కొనసాగనుందని చెప్పారు. గత గురువారం పార్లమెంట్‌లో జరిగిన ఘటనలకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనని చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీలు గూండాల్లా సభలో వ్యవహరించడం.. దాడులు చేసుకోవడంతో భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థకు ఉన్న పరువు పోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తమ ఎంపీలను అదుపులోకి తెచ్చుకోకుండా ఇతరులపై ఆరోపణలు చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెండంకెల స్థానాలు దాటవని ఆయన జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా  మొన్నటి ఘటనతో కాంగ్రెస్‌ పరువు పోయిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రత్యామ్నాయం లేదన్నారు. మూడో ఫ్రంట్‌ ఆవిర్భావంపై మాట్లాడుతూ మూడో ఫ్రంట్‌కు కెప్టెన్‌ ఎవరని ఆయన ఎదురు ప్రశ్నించారు. అవన్నీ ఊహాగానాలేనని, అది ఒక భ్రమేనని చెప్పారు. కాంగ్రెస్‌ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్‌ ప్రజల ప్రభావాన్ని కోల్పోయిందని విమర్శించారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుసరించాల్సిన కనీస పద్దతులను కేజ్రీవాల్‌ పాటించకపోవడం వల్లే బిల్లును ప్రవేశపెట్టేందుకు తాను అంగీకరించలేనన్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో మోడీ కచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *