Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి రాజీనామా చేసినా ఫలితం ఉండదు

మంత్రి రఘువీరా రెడ్డి
అనంతపురం, ఫిబ్రవరి 15: అనంతపరం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయానికి శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఫర్నిచర్‌, విలువైన కాగితాలు అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానానికి వ్యతిరేకంగా ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి డీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యదేశంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేవలం ముఖ్యమంత్రి రాజీనామా చేసినంత మాత్రాన సమస్యకు పరిష్కారం కాదన్నారు. తొలుత అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు ఇచ్చినందునే చివరిగా సారిగా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని, ఈ విషయంలో   కాంగ్రెస్‌ పార్టీని మాత్రమే నిందించడం తగదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, జగన్‌ వంటి వారు ముఖ్యమంత్రితో కలసి ప్రధానిని కలిస్తే ఫలితం ఉండవచ్చన్నారు. ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో అనుచిత కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *