నల్లగొండ, ఫిబ్రవరి 15: పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీల తీరు తెలుగుజాతి పరువు బజారున పడిందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. వారి ప్రవర్తన వల్ల తెలుగువారంతా తలదించుకునేలా అయిందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంట్‌లోకి ప్రాణాంతకమైన పెప్పర్ స్ప్రేను చల్లి ఇతర ఎంపీలను హత్య చేసేందుకు లగడపాటి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రేను చట్టసభల్లోకి తీసుకొచ్చినట్టు చెబుతున్న లగడపాటి కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆత్మరక్షణ కోసం ప్రభుత్వమే కొందరికి తుపాకులు ఇస్తుందని, అంత మాత్రాన చట్టసభల్లోకి తీసుకువస్తారా అంటూ ప్రశ్నించారు. లగడపాటి పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకుండా ఆగిపోతే అందుకు కారణం చంద్రబాబేనని ఆరోపించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలని ఆ పార్టీ నాయకులపై ఒత్తిడి తెచ్చి తెలంగాణపై మాట మార్చేలా చేశారని ఆయన చెప్పారు. ఇంతకాలం బేషరతుగా తెలంగాణకు మద్దతు ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాటమార్చడానికి బాబే కారణమని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన రెండుకళ్ల సిద్దాంతం వదిలి తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.




