గుంటూరు, ఫిబ్రవరి 15:పార్లమెంట్‌లో గురువారం జరిగిన ఘటనతో ప్రజాస్వామ్యంలో దిగజారిందని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వీధిరౌడిల్లా ప్రవర్తించడం దారుణమని చెప్పారు. వారి ప్రవర్తన వల్ల చెప్పుకోవడానికే సిగ్గేస్తుందన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో లగడపాటి తీరును ఆక్షేపించారు. ఆయన ప్రవర్తన వల్ల కేంద్రం వద్ద సీమాంధ్ర ఎంపీల వాయిస్ లేకుండా పోయిందని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ఎంపీల తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. తెలుగుదేశం ఎంపీలు సభలోకి కత్తులు తీసుకురావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతంతో ఒకే విధానం చెప్పకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని, ఇప్పుడు తాజాగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తద్వారా చివరకు బీజేపీ సైతం మాట మార్చేలా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవాచేశారు.




