Wednesday, 4 November 2026

రాజ్యసభలో బలమెంత?

తెలంగాణ బిల్లుపై లెక్కలేసుకుంటున్న పార్టీలు

బీజేపీ మద్దతు లేకున్నా సునాయసంగా గట్టెక్కవచ్చన్న పరిశీలకులు

న్యూఢిల్లీ,  ఫిబ్రవరి 15: తెలంగాణపై బీజేపీలో స్వరం మారడం.. ఎలాగైనా బిల్లును అడ్డుకొని తీరుతామని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వ్యూహాల్లో నిమగ్నమవడం.. బిల్లును పాస్‌ చేసి తీరుతామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్‌ ఉభయ సభలపై పడింది. అసలు తెలంగాణ బిల్లు గట్టెక్కుతుందా? అనే విషయమై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఉత్కంఠతను రేకిస్తున్న ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాట ప్రకారం బీజేపీ మద్దతు ఇస్తే తెలంగాణ బిల్లు సునాయసంగా గట్టెక్కుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ వైఖరిలో మార్పు రావడం.. ప్రతి విషయంలో సవరణలపేరిట తిరకాసు పెట్టడం  కాంగ్రెస్‌కు చికాకు తెప్పిస్తోంది. దీంతో బిల్లును ఎలా గట్టెక్కించాలనే విషయమై అధికార కాంగ్రెస్‌ తర్జనభర్జన పడుతోంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మాత్రం ఈ అంశంపై గట్టి పట్టుదలతో ఉన్నారు. బీజేపీ దారికొస్తే సరేసరి. లేకుంటే మూజువాణితోనైనా గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో  అత్యంత నాటకీయంగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నెల 18, లేదా 19వ తేదీలలో ఏదో ఒక రోజు వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును పాస్‌ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వెనువెంటనే రాజ్యసభలోనూ ఆమోదింపజేసుకోవాలని చూస్తోంది. అయితే రాజ్యసభలో అధికార పక్షానికి బలమెంత? టీబిల్లు సునాయసంగానే పాస్‌ అవుతుందా? అనే అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు రాజ్యసభలో ఆ పార్టీకి ఎంత ఉందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో తమకున్న బలంతో తెలంగాణ బిల్లును సునయాసంగా ఆమోదింపజేసుకోవాలనే ధీమాతో కాంగ్రెస్‌ అధిష్టానం ఉంది. మొత్తం సభ్యుల సంఖ్య 245కాగా, ఇందులో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 72. తమకు మద్దతుగా నిలిచే పార్టీల బలంతో సునాయసంగా గట్టెక్కవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే బీఎస్పీకి 15, జేడీయూకి9, డీఎంకేకు6, ఎన్సీపీకి6, సీపీఐకి 2, ఆర్జేడీకి2 మంది చొప్పున సభ్యులున్నారు. వారికి తోడు ఇతరులు 8మంది ఉన్నారు. చిన్నాచితక పార్టీలకున్న 10మంది సభ్యుల మద్దతుతో తెలంగాణ బిల్లును సునాయసంగా ఆమోదింపజేసుకోవచ్చని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. అయితే బీజేపీ మద్దతు కూడా లభిస్తే అత్యధిక మెజార్జీతో ఆమోదింపజేసుకోగలుగుతామని అంటున్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్న  పార్టీలు మొత్తం 54మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సీసీఎం11, టీఎంసీ9, ఎస్పీ9, అన్నాడీఎంకే 7, బీజేడీ6, టీడీపీ 4, శిరోమణి అకాళిదళ్‌ 3, శివసేన4 కలుపుకుంటే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్న సభ్యుల బలం 54మాత్రమే అవుతోంది. ఈ లెక్కన ఓటింగ్‌ జరిగినా బిల్లు సునాయసంగా గట్టెక్కవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *