అద్వాని బృందం ఎత్తుగడ
అందుకే తెలంగాణపై స్వరం మార్పు
బీజేపీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు యత్నం
తెలంగాణ రాకపోవడానికి మోడీయే కారణమనే
పరోక్ష సంకేతాలిచ్చేందుకు వ్యూహం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని దెబ్బతీసేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ఎల్కే అద్వాని, సుష్మస్వరాజ్, అరుణ్‌జైట్లీలు, వెంకయ్యనాయుడులు కలిసి కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి ఇప్పటివరకు ప్రజల్లో వున్న విశ్వసనీయతను దెబ్బతీసేందుకే తెలంగాణ అంశంపై మాట మార్చి ప్రజల్లో వున్న గౌరవాన్ని తగ్గించడంతో పాటు మోడీకి వస్తున్న మద్దతును అడ్డుకునేందుకు వీరి ఎత్తుగడలు వేస్తున్నారా అన్న అనుమాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై అద్వాని, సుష్మస్వరాజ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జెట్లీ వంటి వారు యూపీఏ ప్రభుత్వం బిల్లు పెడితే తాము మద్దతు ఇచ్చేదిలేదన్నట్లుగా మాట్లాడటాన్ని వారు ఉదహరిస్తున్నారు. మొదటి నుండి నరేంద్ర మోడీ అద్వాని అనుచరుడిగా కొనసాగినా ప్రధాని అభ్యర్థిగా తనను కాదని మోడీని ప్రకటించడం ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఒకనొకదశలో ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖాస్త్రం కూడా సంధించారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న అద్వాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ సానుకూలంగా నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు ఆయన బీజేపీలో మళ్లీ క్రియాశీలకం అయ్యారు. దేశవ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న తెలంగాణ అంశంపై బీజేపీ స్వరం మార్చడం ద్వారా మోడీని దెబ్బతీయాలని అద్వాని ఎత్తుగడ వేసినట్లుగా అందరూ అనుమానిస్తున్నారు. పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించాలని మెజార్టీ నాయకులు నిర్ణయం తీసుకోవడంతో ఆయన సమావేశంలో అలిగి మధ్యలోనే వెళ్లిపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మాత్రం మరీ పట్టుబట్టి మోడీ పేరును ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి అద్వాని రాజ్‌నాథ్‌సింగ్‌ల మధ్య సఖ్యత లేకుండా పోయింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న తనను కాదని, మోడీ పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై సుష్మస్వరాజ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోయింది. మరో అగ్రనేత , రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు అద్వానికి అనుంగ శిష్యుడు, పైగా ఆయన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. మొదట్లో కాంగ్రెస్ తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోబోదనే నమ్మకంతో వెంకయ్యనాయుడు సైతం తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే, వెంకయ్య అంచనాలు తలకిందులై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పరిణామం వెంకయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అనంతరం తన నిజస్వరూపాన్ని బయట పెడుతూ వస్తున్నారు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని బీజేపీకి దగ్గరవడంలో వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషించారు. పనిలోపనిగా ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు సలహాను సైతం స్వీకరించి తాను సొంతంగా తెలంగాణను స్వీకరిస్తే బాగుండదని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిచే మోడీపై అద్వానిచే ఒత్తిడి తెప్పించి తెలంగాణపై బీజేపీ తీసుకున్న సానుకూల నిర్ణయం నుండి వెనక్కు వచ్చేలా చేసినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణను అడ్డుకుంటే ఇరుప్రాంతాలలో కాంగ్రెస్ బలహీనపడడం ద్వారా బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటములు మెజార్టీ సీట్లు గెలుచుకుంటాయని, తద్వారా యూపీఏ కూటమిలో కీలక పాత్ర పోషించిన ఆంధ్ర ప్రదేశ్ వచ్చే ఎన్నికల్లో మోడీని ప్రధాని చేసేందుకు కూడా అదే పాత్రను పోషిస్తుందని, మోడీకి చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన ఆగిపోతే ప్రస్తుతం తెలంగాణలో బలంగా ఉన్న ఆ పార్టీ పూర్తిగా దెబ్బతినడం ఖాయమని, సీమాంధ్రలో బీజేపీ బలం నామమాత్రమే అన్న విషయాలను గోప్యంగా ఉంచి మోడీని ఒప్పించి ఉండొచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే, రాజ్‌నాథ్‌సింగ్ మాత్రం కచ్చితంగా తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని, పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తున్నానని చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందే సమయంలోగానీ, బీజేపీ స్టాండ్ అవకాశాలు లేవు. ఏదేమైనా తెలంగాణ అంశం ద్వారా బీజేపీ విశ్వసనీయతను దెబ్బతీయడం ద్వారా తెలంగాణ రాకపోవడానికి మోడీనే కారణమనే సాకును ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహాత్మకంగా అద్వాని బృందం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.




