Wednesday, 4 November 2026

సీమాంధ్ర మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది

ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపాటు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఎపిఇఎంఎస్‌): పార్లమెంట్‌లో జరిగిన సంఘటనను సీమాంధ్ర మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. శనివారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ  నుంచి సస్పెండ్‌ అయిన ఎంపీలతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ లక్ష్మణ రేఖను దాటారని పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పార్టీ శ్రేయస్సుకు మంచిది కాదని అన్నారు. పార్లమెంట్‌కు, అసెంబ్లీకి తెలంగాణ బిల్లును రాష్ట్రపతి పంపబోరని ఇష్టం వచ్చిన రీతిలో సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేసి పార్లమెంట్‌కు బిల్లు రావడంతో ప్రత్యక్ష దాడులకు దిగారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు గనుక వస్తే సినిమా చూపుతామని సీమాంధ్ర నేతలు హెచ్చరికలు చేశారని ఆయన గుర్తు చేశారు. అనుకున్నట్టుగానే సీమాంధ్ర నేతలు పార్లమెంట్‌లో దాడులకు దిగితే దానిని సీమాంధ్ర మీడియా వక్రీకరించి చూపుతున్నదని మండిపడ్డారు. పార్లమెంట్‌లో తాను ప్రత్యక్ష సాక్షినని ఆయన అన్నారు. సభలో జరిగిన పూటేజీని  విడుదల చేయాలని లోక్‌సభ కార్యదర్విని పొన్నం డిమాండ్‌ చేశారు. సీమాంధ్ర నేతల వైఖరి వల్ల తెలంగాణ బిల్లు ఆగిపోతుందని, స్పీకర్‌కు రక్షణగా తాము ఉన్నామని ఆయన అన్నారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి రాక్షసుడిగా వ్యవహరించారని పొన్నం ఆరోపించారు. టీడీపీ   నేత రమేష్‌రాథోడ్‌ను ఈ విషయం అడిగితే తెలుస్తుందని అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం లోక్‌సభలో సీమాంధ్ర నేతలు దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము తెలంగాణ కోసం పోరాడుతున్నామని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్ర నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రను పాకిస్థాన్‌లో కలపాలని ఒక నేత, పార్లమెంట్‌ను కాల్చివేస్తామని మరొకరు హెచ్చరికలు జారీ చేస్తున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత 60 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం తాము ఈ విధంగా వ్యవహరించామా? అని ఆయన ప్రశ్నించారు. డబ్బు మదంతో ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. అసెంబ్లీలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణపై దాడి జరిగినప్పుడు బ్లాక్‌డేగా వర్ణించిన సీమాంధ్ర మీడియా ఇప్పుడు పార్లమెంట్‌లో జరిగిన ఘటనను ఎందుకు వక్రీకరిస్తున్నదని ప్రశ్నించారు. లగడపాటి విజయవాడ ప్రజలకు చేసింది ఏమీలేదని ఆరోపించారు. కేవలం కోట్ల రూపాయలు దండుకునేందుకే సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నారని పొన్నం అన్నారు. రాజ్యసభలో వీరంగం చేసిన టీడీపీ ఎంపీలపై బీజేపీ నేతలు ఎందుకు విమర్శించడం లేదన్నారు. మిగిలిన 5 రోజుల పార్లమెంట్‌ సమావేశాలు జరగకుండా చేస్తే శాశ్వతంగా తెలంగాణ అంశం మరుగున పడుతుందని సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతామని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *