Wednesday, 4 November 2026

ముసుగులు చింపండి


మోడీ లక్ష్యంగా సోనియా ఫైర్‌
అవినీతి వ్యతిరేక బిల్లుకు భాజపా మద్దతివ్వలేదు : రాహుల్‌
కొచ్చి, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :లౌకికవాద ముసుగులతో ఎన్నికల బరిలో నిలుస్తున్న మతతత్వ శక్తులు ముసుగులు చింపేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. కొచ్చిలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. సీపీఎం సైతం అసంబద్ధ భావజాలంతో తమ లక్ష్యాలు సాధించుకోవడానికి హింసావాదాన్ని అను సరిస్తోందని ఆమె మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధిపొం దడమే లక్ష్యంగా బీజేపీ, ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఇస్తున్న అలవికాని హామీలను గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. మతతత్వ శక్తులు ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రగ ల్చుతున్నారని ఆమె మండిపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలను ప్రజలు గుర్తిం చాలని సూచించారు. మతతత్వ పార్టీ ఎలాంటి వైఖరి అనుసరిస్తోందో సీపీఎం దానినే కాపీ కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించడం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్య మని ఆమె పునరుద్ఘాటించారు. అధికారమే లక్ష్యంగా మతతత్వ శక్తులు పన్నుతున్న కుట్రల వలలో ప్రజలు చిక్కొద్దని పిలుపునిచ్చారు. దేశం ఆరోగ్యకరమైన రీతిలో అభివృద్ధి చెందాలే
తప్ప ద్వేష పూరిత వాతావరణంలో కాదన్నారు. కాషాయదళం ప్రజల్లో ద్వేషం నింపి ప్రజలను విభజించి తద్వారా అధికారాన్ని దక్కించుకోవాలని కుట్రలు పన్నుతోందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు అంతర్గత విభేదాలు పక్కనబెట్టి రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు దోహదపడ్డాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ ఐక్యత కోసం కాంగ్రెస్‌ నిలబడుతోన్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రం ద్వేషభావాన్ని పెంపొందించి ప్రజల మధ్య విభజన సృష్టించడానికి కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఏకాభిప్రాయం లేకపోవడంతోనే పార్లమెంట్‌ ఆమోదం పొందడం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. మరోవైపు కర్ణాటక పర్యటనో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా బీజేపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. అవినీతి వ్యతిరేక బిల్లుకు ఆ పార్టీ మద్దతివ్వలేదని ఆయన తెలిపారు. అవినీతి అంతానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ మద్దతివ్వడం లేదని రాహుల్‌ మండిపడ్డారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌, రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మాటల పార్టే తప్ప చేతల పార్టీ కాదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ప్రజలకు ఏవైతే హామీలిచ్చిందో వాటి అమలుకు కృషి చేసిందని అన్నారు. ఆ పార్టీ పక్షాన ముఖ్యమంత్రులుగా ఎన్నికై అవినీతికి పాల్పడి జైళ్లకు వెళ్లిన వారినే మళ్లీ పార్టీలో చేర్చుకుంటోందని యడ్యూరప్పను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ అవినీతిని ఉపేక్షించబోదని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *