భగత్‌సింగ్‌కూ పెట్టుబడిదారులకు పోలికా?
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
తెలంగాణను అడ్డుకునేందుకే కుట్రలు : కోదండరామ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీలు చేసింది ముమ్మాటికీ పార్లమెంట్‌పై దాడేనని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎంపీలు నాజీలను మించి దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంట్‌పై సీమాంధ్ర ఎంపీల దాడిని నిరసిస్తూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న కోదండరామ్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర పెట్టుబడిదారులు భారీ కుట్రలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌పై దాడి చేసేందుకు పెట్టుబడిదారులు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. కుట్రలో భాగంగానే లోక్‌సభలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేస్తే, మోదుగుల కత్తితో వీరంగం సృష్టించాడని మండిపడ్డారు. పార్లమెంట్‌లో జరిగిన దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టన్నారు. సీమాంధ్ర మీడియా పార్లమెంట్ స్పీకర్ సహా సభ్యుల హత్యకు యత్నించిన లగడపాటిని దేశ దాస్యం శృంకలాల విముక్తి కోసం ఉరికొయ్యనెక్కిన భగత్‌సింగ్‌తో పోల్చడం దారుణమన్నారు. తెలంగాణను ఈ దశలోనూ అడ్డుకునేందుకు సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు కొనసాగిస్తున్నారని, ఢిల్లీ విధ్వంసానికి వ్యూహ రచన చేశారని చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతివ్వాలని ఆయన కోరారు.





