Wednesday, 4 November 2026

తెలంగాణ కోసం విద్యార్థి ఆత్మహత్య


ముత్తారం, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు మరో విద్యార్థిని బలి తీసుకున్నాయి. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా సీమాంధ్రుల దుశ్చర్యలను చూసి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కరీంనగర్‌ జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి పంచాయతీ పరిధిలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన నడిగొట్టు అనిల్‌(15). పదో తరగతి చదువుతున్న అనిల్‌ సకలజనుల సమ్మె నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. గురువారం పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్రులు టీఎంపీలపై దాడి చేయడాన్ని టీవీలో చూసి మనస్తాపం చెందాడు. ఇదే విషయమై తోటి విద్యార్థులతో సాయంత్రం వరకు చర్చించాడు. శుక్రవారం ఉదయం టీవీ చూస్తూ ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు లక్ష్మి గట్టయ్యలు తెలిసిన వారి ఇళ్లన్నీ వెతికారు. అయినా అచూకీ లభించలేదు. కాగా ఆదివారం గ్రామానికి చెందిన బిజ్జాని పాపయ్యకు చెందిన పత్తి చేనులో ఓ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు అనిల్‌ తల్లిదండ్రులకు పోలీసుల సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చూసి అనిల్‌గా గుర్తించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. తమ కుమారుడు ఎక్కడ తెలంగాణ కార్యక్రమం జరిగినా పాల్గొనే వాడని, టీవీలో వస్తున్న తెలంగాణ వార్తలు చూస్తూ ఎప్పుడూ తెలంగాణ గురించే మాట్లాడేవాడని కన్నీరుమున్నీరయ్యారు. మొన్న జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో టీఎంపీలపై జరిగిన దాడిని తట్టుకోలేకే పురుగుల మందు తాగి తెలంగాణ చనిపోయాడంటూ రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీంద్రరాజా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *