
విభజనను అడ్డుకోలేమన్న సుప్రీం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలంటూ పిటిషన్లు దాఖలు చేసిన సమైక్యవాదులకు సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురయింది. దీనిపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సోమవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బిల్లు పార్లమెంట్ పరిధిలో ఉందని, విభజన ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. గతంలో సీనియర్ న్యాయవాదులు వాదించినప్పుడే ఇదే సమాధానం ఇవ్వడం జరిగిందని గుర్తు చేసింది. ఇప్పుడ మళ్లీ ఇదే విషయమై కోర్టుకురావడాన్ని తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో సీమాంధ్ర నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. బిల్లు పార్లమెంట్లో ఉండగా తాను ఎలా జోక్యం చేసుకుంటామని జస్టిస్ దత్తు ధర్మాసనం పిటిషన్లను తోసిపుచ్చింది. విభజనకు వ్యతిరేకంగా సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని కోర్టు తోసిపుచ్చింది. విభజన అంశం పార్లమెంటు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని, గతంలో సీనియర్ న్యాయవాదులు వాదించినప్పుడు కూడా తాము ఇదే చెప్పామని తెలిపారు. సరైన సమయంలో విభజన అంశంపై కోర్టును ఆశ్రయించవచ్చునని సుప్రీం సూచించింది. ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమంది. జస్టిస్ దత్తు నేతృత్వంలోని బెంచ్ వీటిని తోసుపుచ్చింది. కాగా, పది రోజుల క్రితం ఒకేసారి పది పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఫిబ్రవరి 7న కొట్టివేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అపరిపక్వ దశలో ఉన్న పిటిషన్ల పైన విచారణ చేపట్టలేమని, గతంలో వేసిన పిటిషన్లకు ఇప్పటికీ తేడా లేదని పేర్కొంది. పిటిషన్లపై విచారణకు ఇది సరైన సమయం కాదని తెలిపింది. ఈ దశలో జోక్యం చేసుకోవడం తొందరపాటు అవుతుందన్నారు. అదే సమయంలో సరైన సమయంలో కోర్టుకు రావాలని సూచించింది. విభజనపై న్యాయవాదులు చేసిన వాదనలను జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డేతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దాదాపు గంటన్నరపాటు అప్పుడు వాదనలు జరిగాయి ఆ తర్వాత మళ్లీ మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని ఇప్పుడు కోర్టు తోసిపుచ్చింది.
సమైక్యవాదులకు మరోసారి చుక్కెదురు




