Wednesday, 4 November 2026

సీఎం రాజీనామాతో విభజన ఆగదు : బొత్స


హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
సీఎం కిరణ్‌ రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్‌ విభజన ఆగదని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. బొత్స సోమవారం తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యలేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో పరిణామాలు వేగంగా జరుగుతున్నాయని, ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదిస్తారని కేంద్ర మంత్రులు చెబుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. సీమాంధ్ర మంత్రులతో సమావేశం సీఎం, టిడిపి, వైకాపా, సీపీఎం అధ్యక్షులు కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానిని, వివిధ పార్టీల జాతీయ అధ్యక్షులను కలవాలని బొత్స అన్నారు. అందరూ కలిసి చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించామన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకుంటే ఫలితం ఉండేదన్నారు. పార్లమెంటులో సీమాంధ్ర సభ్యులు చేస్తున్న ప్రయత్నాలకు నైతిక మద్దతు ఇస్తామన్నారు. ఈ సమయంలో సీఎం రాజీనామా, కొత్త పార్టీ అంశాలు అప్రస్తుతమని బొత్స అభిప్రాయపడ్డారు. రాష్ట్రమంతా భగభగ మండే సమయంలో సున్నిత అంశాలు మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్ర మనుగడ తమకు కావాలన్నారు. కార్యకర్త మొదలు సీఎం వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగాలని పార్టీ అధ్యక్షుడిగా కోరుతున్నానని బొత్స పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స నివాసంలో సీమాంధ్ర మంత్రుల భేటీ ముగిసింది. ఈ సందర్భంలోనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి బొత్స బహిరంగ లేఖ రాశారు. ఈ వారం కీలకంగా మారిందని లేఖలో పేర్కొన్న పీసీసీ చీఫ్‌.. ఈ వారంలోనే సమైక్యాంధ్ర కోసం ప్రయత్నాలు చిత్తశుద్ధితో కొనసాగించాల్సిన అవసరముందని గుర్తుచేశారు. సీఎంకు రాసిన లేఖ ప్రతినే చంద్రబాబు, రాఘవులు, జగన్‌లకు కూడా పంపారు. సీమాంధ్ర ప్రాంత మంత్రులు భేటీ లో పాల్గొన్నారు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి , కొండ్రు మురళి, కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరా, బాలరాజు, డొక్కా, సి. రామచంద్రయ్య ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ రక్షణ, రాష్ట్ర సమైక్యత, కేంద్రమంత్రులు, ఎంపీలకు బాసటగా నిలవడం, నిన్నటి సీఎం భేటీలో చర్చించారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డికి మంగళవారమే ఆఖరి రోజని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై లోక్‌సభలో చర్చ ప్రారంభం కాగానే రాజీనామా చేయాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై లోక్‌సభలో మంగళవారం చర్చ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సచివాలయంలోని సీఎం పేషీలో వ్యక్తిగత వస్తువులను సిబ్బంది తీసుకువెళ్లినట్లు సమాచారం. పేషీ అధికారులు కూడా సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. తన రాజీనామాకు సంబంధించి సీఎం ఒకరిద్దరు ఎంపీలకు సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది.అయితే రాజీనామా చేయవద్దని బొత్స చేసిన సూచన ఫలిస్తుందా లేక సిఎం గతంలో చేసిన మాదిరిగా ఈ రాజీనామాపై కూడా రాజకీయం చేస్తున్నారా అన్నది తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *