
భేటీ వేస్ట్ అన్న సీమాంధ్ర మంత్రులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర మంత్రుల ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నో చెప్పారు. అలాగే రాయల తెలంగాణ ప్రతిపాదనను కూడా ఆయన వ్యతిరేకించారు. సోమవారం సీమాంధ్ర మంత్రులు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్ర మంత్రులు పలు డిమాండ్లను ఆయన ముందుంచారు. లోక్‌సభ ఎజెండాలో 41వ అంశంగా మంగళవారం చర్చించనున్న నేపథ్యంలో సీమాంధ్ర మంత్రులు ఎలాగైనా తమ ప్రతిపాదనలను రాహుల్‌గాంధీ ద్వారా ఒప్పించుకునే ప్రయత్నం చేశారు. గంటకుపైగా సాగిన సమావేశంలో ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా విభజన ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రులు రాహుల్‌ను కోరారు. అయితే సీమాంధ్రకు న్యాయంగా దక్కాల్సిన సౌకర్యాలు తప్ప యూటీ, రాయల తెలంగాణ డిమాండ్లను అంగీకరించబోమని రాహుల్ వారికి తేల్చిచెప్పారు. రాహుల్‌తో భేటీ అనంతరం మంత్రి జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలన్న తమ ప్రతిపాదనకు రాహుల్ సమ్మతం తెలిపారని అన్నారు. అయితే రాహుల్‌తో భేటీ నిష్ప్రయోజనమని మరికొందరు సీమాంధ్ర మంత్రులు పేర్కొన్నారు. సీమాంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఏ ఒక్కరికి నష్టం కలుగకుండా చూడాలని తాము కోరామని శీలం చెప్పారు. జమ్మూ-కాశ్మీర్, ఈశన్య రాష్ట్రాల్లా సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాహుల్‌ను కోరినట్లు చెప్పారు. సీమాంధ్రకు కొంతకాలం పాటు పన్ను మినహాయింపు, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరినట్టు చెప్పారు. రాహుల్‌తో మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిల్లి కృపారాణి, జేడీ శీలం, పురందేశ్వరి, పనబాక లక్ష్మీ, కిశోర్ చంద్రదేవ్ పాల్గొన్నారు.
యూటీకి రాహుల్ నో




