Tuesday, 3 November 2026

రాజీవ్‌ హంతకులను ఆ ఏడుగురిని విడుదల చేస్తున్నాం : జయ


చెన్నై, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) :
రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని మానవబాంబుతో హత్య చేసిన కేసులో సుప్రీం కోర్టు దోషులుగా తేల్చి మరణ శిక్ష విధించిన ఏడుగురు 23 ఏళ్లుగా జైళ్లోనే మగ్గుతున్నారని, సుప్రీం కోర్టు ఇటీవల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చుతూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజీవ్‌ హంతకులకు విడుదల చేయాలని జయలలిత సర్కారు నిర్ణయించింది. హత్య కేసులో దోషులుగా తేలిన శాంతన్‌, మురుగన్‌, పేరరివాళన్‌లకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పుస్తూ సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించగా వీరితో పాటు ఇదే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో నలుగురిని కూడా విడుదల చేయాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. మురుగన్‌ భార్య నళిని, రాబర్ట్‌ ప్రియాస్‌, జయకుమార్‌, రవిచంద్రన్‌లకు జైలు జీవితం నుంచి విముక్తి కల్పించనున్నట్లు ఏఐఏడీఎంకే సర్కారు తెలిపింది. రాజీవ్‌ హత్యకేసును సీబీఐ నమోదు చేసినందున సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 435 ప్రకారం వారిని విడుదల చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి కాబట్టి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని జయలలిత అన్నారు. కేంద్రం కనుక తమ ప్రతిపాదనపై మూడు రోజుల్లోగా స్పందించకపోతే సీఆర్‌పీసీలోని 432 సెక్షన్‌ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేకాధికారాలతో ఈ ఏడుగురిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజీవ్‌ హంతకులకు మూడు రోజుల్లో జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *